రామ్‌చరణ్ ‘పెద్ది’ నుంచి ఇటీవల విడుదలైన ‘చికిరి చికిరి..’ సాంగ్ ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న సందడి అంతాఇంతా కాదు. ఇన్‌స్టాలో ఈ పాట రీల్స్ చేస్తూ యువతరం చెలరేగిపోతున్నది. ముఖ్యంగా ఈ పాట హిందీ వెర్షన్ పెద్ద హిట్. దాంతో దేశవ్యాప్తంగా ఈ పాట ఓ సంచలనంగా మారింది. నిజానికి ఏ.ఆర్.రెహ్మాన్ నుంచి ఈ స్థాయి విజయం ఈ మధ్య అయితే లేదు.
ఊహించని రీతిలో వింటేజ్ రెహ్మాన్ వినిపిస్తున్నాడంటూ శ్రోతలు తెగ సంబరపడిపోతున్నారు. అయితే.. ఈ పాట ‘పెద్ది’ మేకర్స్‌పై పెనుభారాన్నే మోపిందనేది ఫిల్మ్‌వర్గాల మాట. తొలిపాటే ఇంత హిట్ అవ్వడంతో రానున్న పాటలపై కూడా అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దాంతో అటు దర్శకుడు బుచ్చిబాబు సానాకు, ఇటు సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహ్మాన్కూ ప్రెషర్ ఎక్కువైందని చెప్పక తప్పదు. ‘పెద్ది’ మార్చిలో రానుంది.
చిత్రీకరణ కూడా 60శాతం పూర్తయింది. మరోవైపు ప్రమోషన్స్‌ని కూడా వేగవంతం చేశారు. ఈ సినిమా నుంచి రెండో సింగిల్‌ని వచ్చే నెల 3వ వారంలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్రం సంక్రాంతికి విడుదల కానుండటంతో ఆ సినిమా ప్రమోషన్స్‌కి ఇబ్బంది లేకుండా, వారికి అడ్డంకి కాకుండా, జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని పాటను విడుదల చేస్తారట. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందుశర్మ కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్.రత్నవేలు, ఎడిటింగ్: నవీన్ నూలి, సమర్పణ: మైత్రీ మూవీమేకర్స్, నిర్మాత: వెంకటసతీశ్ కిలారు. నిర్మాణం: వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్.