అగ్ర కథానాయకుడు రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడిక్ రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. జాన్వీ కపూర్ కథానాయిక. శివరాజ్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, దివ్యేందుశర్మ ప్రత్యేక పాత్రధారులు. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్ 4న సినిమా విడుదల కానున్నది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ పానిండియా ఎంటర్టైనర్కి సంబంధించిన ఫైనల్ ఎడిట్‌ను లాక్ చేసినట్టు మేకర్స్ గురువారం ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు.
తన ఎడిటింగ్‌తో పదునైన భావోద్వేగాల లోతును అద్భుతంగా ఆవిష్కరించగల నిష్ణాతుడు, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ ఈ సినిమాకు మెయిన్ ఎస్సెట్ అని, ఫైనల్ ఎడిట్ అద్భుతంగా వచ్చిందని, బుచ్చిబాబు సానా గ్రేట్ విజన్‌తో విజువల్ గ్రాండియర్‌గా ‘పెద్ది’ ఉండబోతున్నదని మేకర్స్ తెలిపారు.
రూరల్ స్పోర్ట్స్ నేపథ్యంలో, భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో, బలమైన భావోద్వేగాలతో దర్శకుడు బుచ్చిబాబు సానా సినిమాను తెరకెక్కించారని, రామ్‌చరణ్ ఈ సినిమా కోసం పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారని, పానిండియా స్థాయిలో దక్షిణాది భాషలతోపాటు హిందీలో కూడా ‘పెద్ది’ విడుదల కానున్నదని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్.రత్నవేలు, సంగీతం: ఏఆర్ రెహమాన్, సహ నిర్మాత: ఇషాన్ సక్సేనా, సమర్పణ: మైత్రీ మూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్.