రామ్‌చరణ్ నటిస్తున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. ఇందులో అన్ని ఆటల్లో ఆరితేరిన ఆటకూలీ పాత్రలో రామ్‌చరణ్ కనిపించనున్నారు. ‘ఉప్పెన’ ఫేమ్ బుబ్చిబాబు సానా దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో తెరకెక్కుతున్నది. వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ఈ నేపథ్యంలో బుధవారం మేకర్స్ ఈ సినిమా తొలిపాట గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ని అందించారు. ‘చికిరి చికిరి..’ అనే హుక్లైన్తో సాగే ఈ పాట ప్రోమోను విడుదల చేశారు. ఈ నెల 7న మొత్తం పాటను రిలీజ్ చేయబోతున్నారు.
ఏ.ఆర్.రెహహన్ స్వరపరచిన ఈ పాటలో రామ్‌చరణ్ తన సిగ్నేచర్మ మాస్ స్టెప్స్‌తో అదరగొట్టారు. ప్రస్తుతం ఇది సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఎక్కడో గ్రామీణ ప్రాంతంలో నివసించే కథానాయకుడు తొలిచూపులోనే నాయికపై మనసుపారేసుకుంటాడు. అక్కడి గ్రామీణ మాండలికంలో చికిరి అంటే అందమైన అమ్మాయి అని అర్థం. తొలిచూపులోనే తన మనసుదోచిన ప్రియురాలి మెప్పుపొందే క్రమంలో హీరో పాడే పాట ఇదని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రంలో రామ్‌చరణ్ ప్రియురాలిగా జాన్వీకపూర్ కనిపించనుంది. ఈ చిత్రానికి నిర్మాణం: వృద్ధి సినిమాస్, నిర్మాత: వెంకట సతీష్ కిలారు, సంగీతం: ఏ.ఆర్.రెహమాన్, రచన-దర్శకత్వం: బుచ్చిబాబు సానా.