Ram Charan | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సినిమాలో రామ్ చరణ్ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయిందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ చిత్రం మంచి వసూళ్లను రాబట్టినట్లు సమాచారం. ఇదిలా ఉంటే, ‘పెద్ది’ విడుదల అనంతరం తొలిసారి జాతీయ వేదికపై రామ్ చరణ్ కనిపించారు. రిపబ్లిక్ టీవీ నిర్వహించిన ‘సమ్మిట్ 2026’ కార్యక్రమంలో ఆయన ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతీయ సినిమా, ప్రేక్షకులు, థియేటర్ అనుభవం గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు.
‘గ్రేట్ పవర్ ఇండియా: నేషన్ ఫస్ట్’ అనే థీమ్‌తో నిర్వహించిన ఈ సమ్మిట్‌లో రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా థియేటర్లలో పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ ధరలపై ఆయన చేసిన కామెంట్లు పెద్ద చర్చకు దారితీశాయి. భారతదేశంలో ఇప్పటికీ అత్యంత చౌకైన వినోద సాధనం సినిమా మాత్రమే. కుటుంబ సభ్యులందరూ కలిసి థియేటర్‌కు వెళ్లి సినిమా చూడటం అనేది ఒక ప్రత్యేక అనుభూతి. సినిమా కేవలం వినోదం మాత్రమే కాదు, కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలను మరింత బలపరిచే వేదిక అని రామ్ చరణ్ పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ప్రేక్షకులు ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య థియేటర్లలో ఆహార పదార్థాల ధరలేనని ఆయన అభిప్రాయపడ్డారు.
థియేటర్లలో పాప్‌కార్న్ రేట్లు కొంత తగ్గితే ప్రేక్షకులకు సినిమా అనుభవం మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ ధరలు విపరీతంగా పెరగడంతో చాలా మంది ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది థియేటర్లకు రావడానికి కూడా వెనుకంజ వేస్తున్నారు అని రామ్ చరణ్ స్పష్టం చేశారు.రామ్ చరణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మల్టీప్లెక్స్ యాజమాన్యాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా పీవీఆర్, ఐనాక్స్ వంటి ప్రముఖ మల్టీప్లెక్స్‌లలో అధిక ధరలపై ఇప్పటికే ప్రేక్షకుల్లో అసంతృప్తి వ్యక్తమవుతుండగా, ఇప్పుడు స్టార్ హీరో కూడా అదే విషయాన్ని జాతీయ వేదికపై ప్రస్తావించడం విశేషంగా మారింది.సాధారణ ప్రేక్షకులు ఎదుర్కొంటున్న సమస్యను ఒక స్టార్ హీరో బహిరంగంగా ప్రస్తావించడాన్ని పలువురు సినీ అభిమానులు, నెటిజన్లు అభినందిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా రామ్ చరణ్ వ్యాఖ్యలకు భారీ మద్దతు లభిస్తోంది.