Ramcharan | పాన్ ఇండియా ట్రెండ్‌లో భాషలకు అతీతంగా నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అవకాశాలు వస్తున్నాయి. సినిమాను అన్నీ తానై నడిపించే దర్శకులకు చిత్ర పరిశ్రమల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ప్రతిభ గల దర్శకులను స్టార్ హీరోలు ఏరి కోరి ఎంచుకుంటున్నారు. వారితో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కథానాయకుల జాబితాలో రామ్‌చరణ్ కూడా చేరారు. ఆయన కన్నడ దర్శకుడు నర్తన్‌తో సినిమా చేస్తారనే వార్తలు గతంలోనే వెలువడ్డాయి. అయితే చరణ్ దర్శకుడు బుచ్చిబాబుతో సినిమా ప్రకటించాక..ఇక నర్తన్ సినిమా హోల్డ్‌లో పడ్డట్టే అని అంతా అనుకున్నారు.
తాజా సమాచారం ప్రకారం ఈ కాంబో సినిమా తప్పకుండా ఉంటుందని తెలుస్తున్నది. రామ్‌చరణ్ శంకర్, బుచ్చిబాబు సినిమాలు పూర్తి చేసిన తర్వాత వరుసలో నర్తన్ సినిమానే ఉందట. ప్రస్తుతం శివరాజ్ కుమార్‌తో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారీ దర్శకుడు. నర్తన్ తెరకెక్కించిన ‘మఫ్టీ’ సినిమా ఘన విజయాన్ని సాధించి అతనికి పేరు తీసుకొచ్చింది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ స్టార్ హీరోల ఇమేజ్‌కు తగిన సినిమాను ఆయన రూపొందించగలడని నిరూపించింది.