కీర్తి సురేష్ నాయికగా నటించిన సినిమా గుడ్ లక్ సఖి. క్రీడా నేపథ్య కథతో దర్శకుడు నగేష్ కుకునూర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై సుధీర్ చంద్ర పదిరి గుడ్ లక్ సఖి చిత్రాన్ని నిర్మించారు. ఈ శుక్రవారం గుడ్ లక్ సఖి థియేటర్ లలో రిలీజ్ కు సిద్ధమైంది. ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. హీరో రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో రామ్ చరణ్ మాట్లాడుతూ…కీర్తి సురేష్ జాతీయ ఉత్తమ నటి. ఆమె ద్వారానే గుడ్ లక్ సఖి లాంటి కథలు రావాలి. ఇది చాలా అర్థవంతమైన సినిమా అని చెప్పగలను. దర్శకుడు నగేష్ కుకునూర్ పాతికేళ్ల క్రితమే వెబ్ కంటెంట్ తరహా సినిమాలు చేశారు. నా కాలేజ్ డేస్ లో ఆయన సినిమా హైదరాబాద్ బ్లూస్ చూశాను. చిత్ర పరిశ్రమలో ఆడా మగా తేడా లేదు. అలాంటి హద్దులు ప్రస్తుతం తెలుగు సినిమాకు లేవు. నా అభిమానులు గుడ్ లక్ సఖి చూడండి. అన్నారు. కీర్తి సురేష్ మాట్లాడుతూ…మహానటి తర్వాత సరదాగా ఉండే సినిమా చేయాలనుకున్నాను.
అప్పుడు నగేష్ గారు చెప్పిన గుడ్ లక్ సఖి కథ నచ్చి ప్రాజెక్ట్ ఒప్పుకొన్నాను. ఈ చిత్రంలో నా లుక్ సహజంగా ఉంటుంది అన్నారు. పల్లెటూరిలో ఉండే బంజారా అమ్మాయి జాతీయ స్థాయిలో షూటర్ గా ఎలా ఎదిగిందనేది గుడ్ లక్ సఖి కథ అని. కీర్తి సురేష్ ఒప్పుకొందనే ఈ సినిమా తను చేశానని, జంధ్యాల, కె విశ్వనాథ్ తరహా సినిమాల స్ఫూర్తి గుడ్ లక్ సఖిలో కనిపిస్తుందని పాతికేళ్ల తర్వాత మళ్లీ తెలుగు సినిమా చేయడం ఆనందంగా ఉంది అని దర్శకుడు నగేశ్ కుకునూరు తెలిపారు. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ…నాకు బాగా నచ్చిన సినిమా గుడ్ లక్ సఖి. మంచి సినిమాను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ముందుకొచ్చాం. ఆ తర్వాత కొన్ని ఏరియాలు పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నాం. గుడ్ లక్ సఖి టీమ్ అందరికీ గుడ్ లక్. అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు బుచ్చిబాబు, శ్రావ్యవర్మ, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.