Ram Charan | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే, ఈ చిత్రం షూటింగ్ సమయంలో చరణ్‌కు చిన్నపాటి గాయం అయినట్లు సమాచారం. షూటింగ్ సందర్భంగా చరణ్ కంటి సమీపంలో స్వల్ప గాయం తగిలిందని తెలుస్తోంది. అయితే ఈ గాయం విషయంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చిన్నపాటి గాయమేనని చిత్రబృందం స్పష్టం చేసింది. ఈ గాయం కారణంగా చరణ్ రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నాడు. అనంతరం తిరిగి షూటింగ్లో పాల్గొననున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో కొనసాగుతోంది. త్వరలోనే చిత్ర యూనిట్ ఒక ప్రత్యేక గీతాన్ని చిత్రీకరించనుంది.
ఇక ఈ శుక్రవారం రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘పెద్ది’ చిత్రం నుంచి టీజర్ విడుదలయ్యే అవకాశం ఉందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తుండగా, ప్రముఖ నటులు శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రం, చరణ్ కెరీర్లో మరో కీలక మైలురాయిగా నిలుస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇక ‘పెద్ది’ ఐటమ్ సాంగ్ గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో ముగ్గురు భామలు ఆడిపాడనున్నారని, కాదు నలుగురు హీరోయిన్లు కనిపిస్తారని.. అంటూ అనేక వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.. చివరికి ఇద్దరి పేర్లు మాత్రం ప్రముఖంగా వినిపించాయి. ‘రంగస్థలం’ సినిమాలో జిల్ జిల్ జిగేల్ రాణిగా చెర్రీతో కలిసి చిందులేసిన పూజా హెగ్డేని స్పెషల్ సాంగ్ కోసం సంప్రదిస్తున్నారని టాక్ వచ్చింది. ఆ తర్వాత ‘సీతారామం’ భామ మృణాల్ ఠాకూర్ ఈ పాటలో ఆడిపాడనుందని చెప్పుకొచ్చారు. ఫైనల్ గా మృణాల్ వైపే మేకర్స్ ఎక్కువ మొగ్గుచూపారని సమాచారం. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.