Ram Charan |టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ‘చిరుత’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్, ఒక్కో మెట్టు ఎక్కుతూ గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడు. ‘మగధీర’తో తొలి బ్లాక్‌బస్టర్ అందుకున్న ఆయన, ‘రంగస్థలం’లో అద్భుత నటనతో విమర్శకులను మెప్పించారు. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’తో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో అత్యంత డిమాండ్ ఉన్న నటుల్లో ఒకరిగా మారాడు. ప్రస్తుతం చరణ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమాలో నటిస్తున్నాడు. గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ఇండస్ట్రీలో భారీ అంచనాలను సృష్టిస్తోంది.
జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన “చికిరి చికిరి” ఫస్ట్ సింగిల్ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండ్ సెట్ చేస్తూ రికార్డులు సృష్టిస్తోంది. రామ్ చరణ్ డ్యాన్స్ మూవ్స్, ఎనర్జీ అభిమానులను మంత్ర ముగ్ధులను చేస్తున్నాయి. ‘పెద్ది’ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 27న, చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇదిలా ఉండగా, తాజాగా రామ్ చరణ్ కొంతకాలం సినిమాలకు విరామం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు అనే వార్త టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ‘పెద్ది’ పూర్తయిన తర్వాత కొద్ది నెలల పాటు కొత్త ప్రాజెక్ట్స్ సైన్ చేయకుండా, కుటుంబంతో సమయం గడపాలని చరణ్ నిర్ణయించుకున్నాడట. చరణ్ భార్య ఉపాసన ప్రస్తుతం గర్భవతి కాగా, వారికి కవల పిల్లలు పుట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో డెలివరీ సమయంలో భార్య పక్కనే ఉండి, పుట్టబోయే పిల్లల కోసం సమయం కేటాయించాలని చరణ్ నిర్ణయించుకున్నాడు. గతంలో కుమార్తె క్లీంకార జననం సమయంలో కూడా ఇలాంటి విరామం తీసుకున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ నిర్ణయంపై కొందరు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఆయన సినిమాలకు ఎన్ని రోజులు గ్యాప్ ఇస్తారో అని కొందరు ముచ్చటించుకుంటుండగా, మరి కొందరు చరణ్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు. కెరీర్ ఎంత ముఖ్యమైనా, కుటుంబానికి సమయాన్ని కేటాయించడం గొప్ప విషయం అని, చరణ్ ఈ విషయంలో యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడని నెటిజన్లు అభినందిస్తున్నారు.