Ram Charan | వెండితెర మెరుపుతీగ.. షాజన్ పదంసీ పేరు చెబితే తెలుగు ప్రేక్షకులు ఠక్కున గుర్తు పట్టకపోవచ్చు కాని ఆరేంజ్ బ్యూటీ అంటే మాత్రం ఇట్టే గుర్తుకు వస్తుంది. రామ్ చరణ్ సరసన ‘ఆరెంజ్’లో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఆ సినిమాలో రామ్ చరణ్ గర్ల్‌ఫ్రెండ్‌గా తన అందం, అభినయంతో మెస్మరైజ్ చేసింది. ముఖ్యంగా ‘రూబా రూబా’ పాటలో ఆమె హావభావాలు యువతను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమా తర్వాత వెంకటేష్‌తో కలిసి ‘మసాలా’లో సందడి చేసిన షాజన్, తెలుగు, హిందీ, తమిళ చిత్రాల్లో తనదైన ముద్ర వేసింది.
అయితే అవకాశాలు సరిగా రాకపోవడంతో 2023 నుండి వెండితెరకి దూరంగా ఉంటుంది ఈ భామ. ఈ అమ్మడు.. రాకెట్ సింగ్: సేల్స్‌మ్యాన్ ఆఫ్ ద ఇయర్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. కనిమొళి చిత్రంతో తమిళంలోకి అడుగుపెట్టింది. దిల్ తో బచ్చా హై జీ, హౌస్ ఫుల్ 2 వంటి సినిమాలు హిందీలో చేసింది. 2015లో సాలిడ్ పటేల్స్ సినిమా తర్వాత హిందీలో మరో సినిమా చేయలేదు. దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత 2023లో పాగల్ పన్ నెక్ట్స్ లెవల్ అనే చిత్రం చేయగా, ఈ సినిమా తర్వాత మరో మూవీకి కమిట్ కాలేదు.
గత కొంతకాలంగా ప్రముఖ వ్యాపారవేత్త ఆశిష్‌తో ప్రేమలో ఉన్న షాజన్, గతేడాది నవంబర్లోనే నిశ్చితార్థం చేసుకుంది. ఓ ఫ్రెండ్ ద్వారా షాజన్‌కి పరిచయం కాగా.. అశీష్ తనకు ముందుగా ప్రపోజ్ చేసినట్లు షాజన్ తెలిపింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరిలో వీరి రోకా వేడుక అట్టహాసంగా జరిగింది. కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య వీరి వివాహం గురువారం రాత్రి ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ భామకి నెటిజన్స్ శుభాకంక్షలు తెలియజేస్తున్నారు. ఇక జూన్ 7న సంగీత్ వేడుకతో పాటు మరికొన్ని వేడుకలు కూడా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ శుభకార్యానికి ఇరు కుటుంబాల సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నారని సమాచారం.