Ram Charan | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ఈ చిత్రం విజయోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ శిల్పకళావేదికలో ‘మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్’ను చిత్రబృందం అట్టహాసంగా నిర్వహించింది.ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు సుకుమార్, అనిల్ రావిపూడి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మెగాస్టార్ రాకతో శిల్పకళావేదిక అభిమానుల నినాదాలతో మారుమోగిపోయింది. ఈ సందర్భంగా మాట్లాడిన రామ్ చరణ్ ‘పెద్ది’ తన జీవితంలో ఎంత ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిందో భావోద్వేగంగా వెల్లడించారు.
కొన్ని విజయాలు ఆనందాన్ని ఇస్తాయి.. కొన్ని సంతృప్తిని ఇస్తాయి. కానీ ‘పెద్ది’ విజయం మాత్రం నా జీవితాన్నే మార్చేసింది. ఈ సినిమా నాకు పూర్తిగా కొత్త అనుభూతిని ఇచ్చింది. ఇంతకుముందు సినిమాలకు వచ్చిన ప్రేమ ఒకటైతే, ‘పెద్ది’కి వచ్చిన స్పందన నా గుండెల్లోతుల్లోకి వెళ్లిపోయింది అని రామ్ చరణ్ అన్నారు. ఈ చిత్రాన్ని చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించడం తనను ఎంతగానో ఆనందానికి గురి చేసిందన్నారు. ఇలాంటి అనుభూతి మళ్లీ జీవితంలో వస్తుందో లేదో తెలియదు అంటూ తన భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు. అయితే తన కుమార్తె క్లీంకార గురించి చెప్పిన మాటలు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
పెద్ది రిలీజ్ అయ్యే వరకు నా కూతురు నన్ను ‘నానా’ అని పిలిచేది. ఇప్పుడు ‘ఏయ్ పెద్ది’ అని పిలుస్తోంది. అలా పిలవొద్దు నాన్న అని అంటే ‘ఏయ్ పెద్ది నానా’ అంటోంది. నన్ను మర్చిపోయి పెద్ది గుర్తుండిపోయేలా చేసిన దర్శకుడు బుచ్చిబాబు సానాకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెబుతున్నాను” అంటూ నవ్వులు పూయించారు. దర్శకుడు బుచ్చిబాబు సానాను తనకు పరిచయం చేసిన దర్శకుడు సుకుమార్‌కు రామ్ చరణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సుకుమార్ నా జీవితంలో అత్యంత ఇష్టమైన వ్యక్తుల్లో ఒకరు. ఆయన నాకు పెద్ద అన్నయ్య లాంటి వ్యక్తి అని అన్నారు. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం, ముఖ్యంగా సెకండ్ హాఫ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణం పోసిందని రామ్ చరణ్ తెలిపారు. అలాగే ఎడిటర్ నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్ల, డైరెక్షన్, లైటింగ్, ఇతర సాంకేతిక విభాగాలందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. “తెలుగు ప్రజలు ఎవరినీ అంత ఈజీగా ఇష్టపడరు. ఒకసారి ఇష్టపడితే జీవితాంతం ప్రేమిస్తారు” అంటూ ‘ఠాగూర్’ సినిమాలోని డైలాగ్‌ను గుర్తు చేసుకున్న రామ్ చరణ్, ‘పెద్ది’ తమ సినిమా కాదని, ఇది ప్రేక్షక దేవుళ్ల సినిమా అని పేర్కొన్నారు.