‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని నాటు నాటు పాట ఆస్కార్‌కు ఉత్తమ పాట విభాగంలో పోటీ పడుతున్న నేపథ్యంలో ఈ వేడుకలో పాల్గొనేందుకు సతీమణి ఉపాసనతో కలిసి ఆమెరికా లాస్ ఏంజెలీస్ వెళ్లారు రామ్ చరణ్. ఇక్కడ జరుగుతున్న పలు ఈవెంట్స్‌లో ఈ స్టార్ కపుల్ పాల్గొంటున్నారు. ఈ క్రమంలో పారామౌంట్ పిక్చర్స్ స్టూడియోస్‌లో మలాలా యూసుఫ్ జైన్‌తో కలిసి ప్రియాంక చోప్రా హాజరైన కార్యక్రమంలో చరణ్, ఉపాసన పాల్గొన్నారు. దక్షిణాసియాకు చెందిన సినిమాలు ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయిన నేపథ్యంలో పారామౌంట్ సంస్థ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భాన్ని ఉపాసన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. తమకు సపోర్ట్ చేస్తున్న ప్రియాంకకు కృతజ్ఞతలు తెలిపిన ఉపాసన…ఆమెతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. ప్రియాంక చోప్రా, రామ్‌చరణ్ గతంలో ‘జంజీర్’ అనే హిందీ చిత్రంలో జంటగా నటించారు.