రామ్‌చరణ్, శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజర్’పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 10న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీ ఎత్తున ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటివరకూ రామ్‌చరణ్ నటించిన చిత్రాలకు పూర్తి భిన్నమైన సినిమాగా ‘గేమ్‌చేంజర్’ నిలుస్తుందని, నటుడిగా ఆయన్ని మరోస్థాయిలో నిలబెట్టే సినిమా అవుతుందని నిర్మాత దిల్‌రాజు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో తండ్రీకొడుకులైన అప్పన్న, రామ్నందన్లుగా రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే.
విభిన్నమైన పీరియడ్స్‌లో ఈ పాత్రలు ఉంటాయని సమాచారం. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే తండ్రి ఎపిసోడ్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని తెలుస్తున్నది. తండ్రి పాత్రకు జోడీగా అంజలి నటిస్తుండగా, కొడుకు రామ్నందన్కు జంటగా కైరా అద్వాణీ కనిపించనున్నది. ఇంకా శ్రీకాంత్, సముద్రఖని, ఎస్.ఎజె.సూర్య, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలావుంటే.. నిర్మాత దిల్‌రాజు ఈ సినిమా ప్రచారాన్ని వేగవంతం చేశారు. అందులో భాగంగా ఈ నెల 9న లక్నోలో ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నారు. లక్నోలో ఇంత భారీగా టీజర్ రిలీజ్ చేస్తున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం.