Ram Charan – Parliament | ‘ఆర్ఆర్ఆర్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ‘గేమ్ ఛేంజర్’ అంటూ వచ్చాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుందనుకుంటే బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. దీంతో ఎలాగైన హిట్ కొట్టాలానే కసితో ప్రస్తుతం ఒక సినిమా చేస్తున్నాడు. ఆయన కథానాయకుడిగా రాబోతున్న తాజా ప్రాజెక్ట్ #RC16. పాన్ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తుండగా.. ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఉత్తరాంధ్రా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా కోసం రామ్ చరణ్ పార్లమెంట్‌కి వెళ్లబోతున్నాడు.
ఈ సినిమాలోని కథలో భాగంగా.. ఢిల్లీలోని పార్లమెంట్ (Parliament) భవనంలో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు మేకర్స్. ఇందులో భాగంగానే రామ్‌చరణ్ పార్లమెంట్లో జరిగే షూటింగ్లో పాల్గోననున్నాడు. ఈ షూటింగ్ కోసం చిత్రబృందం ఇప్పటికే అవసరమైన అనుమతుల కోసం దరఖాస్తు చేసుకొగా.. అధికారుల నుంచి అనుమతుల కోసం ఎదురుచూస్తుంది. ఇక అనుమతి వచ్చిన అనంతరం పార్లమెంట్లో షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. అదే సమయంలో.. ఢిల్లీలోని జమా మసీద్ (Jama Masjid) వద్ద కూడా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు, కానీ రంజాన్ మాసం కారణంగా ఆ షెడ్యూల్ మార్చి చివరి వరకు వాయిదా పడే అవకాశం ఉంది. మరోవైపు ఈ విషయంపై ఉత్తరాంధ్ర ప్రాంతంలోని గ్రామీణ నేపథ్యంలో సాగే కథకి పార్లమెంట్‌కి లింక్ ఏంటి అని నెటిజన్లతో పాటు మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, కన్నడ చక్రవర్తి శివరాజ్‌కుమార్, దివ్యేండు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.