‘ప్రేక్షకులు ‘పెద్ది’ సినిమాను స్వీకరించిన తీరు చూస్తుంటే నిజాయతీగా పనిచేస్తే ఏ సినిమా అయినా హిట్ కావాల్సిందే అనే నమ్మకం ఏర్పడింది. నాకు నచ్చిన పని చేస్తూ మీ అందరి ప్రేమను పొందడం ఆశ్చర్యంగా ఉంది’ అన్నారు అగ్రహీరో రామ్‌చరణ్. ఆయన కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వెంకట సతీష్ కిలారు నిర్మించిన పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ఇటీవలే విడుదలై విజయపథంలో పయనిస్తున్నది.
సోమవారం హైదరాబాద్‌లో థాంక్యూ మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రామ్‌చరణ్ పై విధంగా స్పందించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఇండియాతో పాటు విదేశాల్లో కూడా రోజురోజుకి కలెక్షన్స్ పెరగడం ఆనందంగా ఉంది. సినిమా చూసినవాళ్లందరూ స్ఫూర్తివంతమైన కథ ఇదని అంటున్నారు. ప్రేక్షకుల మధ్య థియేటర్లలో సినిమా చూశా. నేను ఊహించని సన్నివేశాలకు కూడా వాళ్లు చప్పట్లు కొడుతున్నారు.
నిజంగా ఇదో కొత్త అనుభూతి. నా సినీ లైబ్రరీలో నెంబర్ వన్‌గా నిలిచే సినిమా ఇది’ అన్నారు. ‘ఖేలో ఇండియా’ స్ఫూర్తితో, భారతీయ జీవన విధానంలో ఆట ఓ భాగమని చెప్పాలనే లక్ష్యంతో ఈ సినిమా తీశానని, ఇదొక స్ఫూర్తినింపే గాథ అని దర్శకుడు బుచ్చిబాబు సానా అన్నారు. సోమవారం కూడా కలెక్షన్స్ ఎక్స్‌ట్రార్డీనరీగా ఉన్నాయని, హిందీలో కూడా అద్భుతమైన స్పందన లభిస్తున్నదని, నిర్మాతగా మోస్ట్ మెమొరబుల్ మూవీ ఇదని నిర్మాత వెంకట సతీష్ కిలారు ఆనందం వ్యక్తం చేశారు.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత వై.రవిశంకర్ మాట్లాడుతూ ‘రామ్‌చరణ్ ఈ సినిమాకోసం ప్రాణంపెట్టి పనిచేశారు. ఒంటికాలితో సినిమాను ముందుకు తీసుకెళ్లారు. అంతగా పాత్రలో లీనమైపోయి నటించారు. పిల్లల్ని తీసుకెళ్లి సినిమా చూడాలని తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. గొప్ప స్ఫూర్తితో తీసిన సినిమా ఇది’ అన్నారు. ఈ కార్యక్రమంలో మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి, గీత రచయిత అనంత శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.