Rakul Preet Singh | బాలీవుడ్ అగ్ర నటులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘బడే మియా చోటే మియా’ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. రకుల్ భర్త జాకీ భగ్నానీకి చెందిన పూజా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ సుమారు రూ. 400 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించింది. అయితే భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కేవలం రూ.60 కోట్ల వసూళ్లను సాధించి అట్టర్‌ఫ్లాప్ అందుకోవడమే కాకుండా తమ కుటుంబానికి భారీ నష్టం వాటిల్లిందని రకుల్ ప్రీత్ సింగ్ తెలిపింది.
బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రకుల్ మాట్లాడుతూ.. పూజా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో వచ్చిన గత మూడు సినిమాలు ఆశించిన విజయం అందుకోలేదు. దీంతో ఈ విషయంలో మాకు చాలా ఆర్థిక నష్టం జరిగింది. అయితే ఇలాంటి ఇబ్బందులు ప్రతి నిర్మాతకూ వస్తాయి. అమితాబ్ బచ్చన్ గారికి కూడా ఒక సమయంలో జరిగింది. ఇది కేవలం ఒక దశ మాత్రమే. మేము తప్పకుండా మళ్ళీ పుంజుకుంటాం అని రకుల్ అన్నారు. అయితే ఈ ఆర్థిక నష్టాల వలన తమ నిర్మాణ సంస్థ ‘పూజా ఎంటర్టైన్మెంట్స్’ మూతపడిందనే వదంతులను ఆమె పూర్తిగా ఖండించారు. మీడియాలో పరిస్థితిని ఎక్కువగా చూపిస్తున్నారని, కంపెనీ సేవలు కొనసాగుతున్నాయని రకుల్ స్పష్టం చేశారు.
అంతకుముందు జాకీ భగ్నానీ స్వయంగా ఈ సినిమా వైఫల్యం గురించి మాట్లాడుతూ, భారీ పెట్టుబడి కోసం తమ కుటుంబం ఆస్తులను కూడా తాకట్టు పెట్టాల్సి వచ్చిందని, పెట్టిన పెట్టుబడిలో కేవలం 50 శాతం కంటే తక్కువే తిరిగి వచ్చిందని వెల్లడించారు.