Rakul Preet Singh | అగ్ర కథానాయిక రకుల్‌ప్రీత్‌సింగ్ పెళ్లిపీటలెక్కబోతున్నది. బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో ఈ భామ నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరి వివాహం ఈ నెల 21న గోవాలో జరగనుంది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరుకాబోతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో వీరి పెళ్లికి సంబంధించిన ఆహ్వాన పత్రిక సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
దాదాపు మూడు రోజుల పాటు వైభవంగా ఈ పెళ్లి వేడుకను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. బాలీవుడ్ పరిశ్రమకు చెందిన డిజైనర్లు సబ్యసాచి, తరుణ్ తహిల్యానీ, మనీష్ మల్హోత్రా పెళ్లి దుస్తులను డిజైన్ చేశారని తెలిసింది. ‘మహిళ ఎప్పటికైనా తన పుట్టినిల్లు నుంచి మరొక ఇంటికి వెళ్లాల్సిందే. ఈ మార్పును అంగీకరించి స్వాగతించాలి. మనం ఎంత పాజిటివ్‌గా ఆలోచిస్తే అంత మంచి జరుగుతుంది’ అంటూ రకుల్‌ప్రీత్‌సింగ్ తన పెళ్లి గురించి చెప్పింది. ప్రస్తుతం ఆమె తెలుగులో పాటు దక్షిణాది భాషల్లో మంచి అవకాశాలతో దూసుకుపోతున్నది.