రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన రొమాంటిక్ ఎంటైర్టెనర్ ‘శశివదనే’. సాయిమోహన్ ఉబ్బన దర్శకుడు. అహితేజ బెల్లంకొండ, అభిలాష్‌రెడ్డి గోడల నిర్మాతలు. ఈ నెల 10న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. తండ్రికొడుకుల అనుబంధాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన సినిమా ఇదని, ఇందులోని గోదావరి అందాలు విజువల్ ఫీస్ట్‌గా ఉంటాయని, సాంకేతికంగా అన్ని విధాలుగా సినిమా ఆకట్టుకుంటుందని, కథానాయిక కోమలికి ఈ సినిమా మంచి బ్రేక్‌గా నిలుస్తుందని, అశ్లీలతకు తావు లేకుండా ఈ సినిమా చేశామని హీరో రక్షిత్ అట్లూరి తెలిపారు.
ఇదొక అందమైన పెయింటింగ్ లాంటి సినిమా అనీ, కచ్ఛితంగా అందరికీ నచ్చుతుందని దర్శకుడు సాయిమోహన్ అన్నారు. ఆడియన్స్‌కి మంచి అనుభూతినిచ్చే సినిమా ‘శశివదనే’ అనీ, ఈ సినిమా ఎవరినీ నిరాశపరచదనీ నిర్మాత అహితేజ నమ్మకం వ్యక్తం చేశారు. అందరూ ప్రాణం పెట్టి చేసిన సినిమా ఇదని కథానాయిక కోమలి ప్రసాద్ పేర్కొన్నారు. ఇంకా డీవోపీ సాయికుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీపాల్, నటి అంబిక కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: శరవణ వాసుదేవన్, సమర్పణ: గౌరీ నాయుడు.