Rakshit Atluri | టాలీవుడ్లో ‘దండోరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానికే దారి తీశాయి. ఆయన స్పీచ్‌లో ఉపయోగించిన కొన్ని అమర్యాదకరమైన పదాలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో గాయని చిన్మయి, నటి అనసూయ సహా పలువురు మహిళా ప్రముఖులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే తాజాగా ఈ వివాదంలో శివాజీకి ఓపెన్‌గా మద్దతు పలికారు యువ హీరో రక్షిత్ అట్లూరి. శివాజీ తన ప్రసంగంలో దొర్లిన రెండు పదాల విషయంలో మహిళా సమాజాన్ని ఉద్దేశించి క్షమాపణ చెప్పినా, అది చాలదన్న అభిప్రాయం బలంగా వ్యక్తమైంది.
క్షమాపణ చెప్పినా కూడా ఆయన మాటల్లోని భావజాలమే సమస్య అని విమర్శకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీ నుంచి భిన్నమైన స్వరం వినిపించింది. అదే రక్షిత్ అట్లూరిది. ‘పలాస 1978’ సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రక్షిత్ అట్లూరి, ఈ వివాదంపై వీడియో విడుదల చేస్తూ తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు. “శివాజీ గారు వాడిన పదాలు తప్పు కావచ్చు. అందుకే ఆయన క్షమాపణ కూడా చెప్పారు. కానీ ఆయన చెప్పాలనుకున్న కంటెంట్‌లో మాత్రం తప్పు ఏమీ లేదని నాకు అనిపించలేదు” అని రక్షిత్ పేర్కొన్నారు. “సంప్రదాయబద్ధంగా చీర కట్టుకున్నా కూడా మహిళలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంటే సమస్య దుస్తుల్లో కాదు, మన సమాజంలో ఉంది. మనం ఎటువంటి సమాజంలో జీవిస్తున్నామో అర్థం చేసుకుని మరింత జాగ్రత్తగా ఉండాలి” అని రక్షిత్ వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా మరో కీలక ప్రశ్నకూ ఆయన స్పందించారు. “మహిళలకు మాత్రమే జాగ్రత్త చెప్పడం సరిపోదు. అబ్బాయిలకు కూడా తప్పకుండా చెప్పాలి – మహిళలను ఎలా చూడాలి, ఎలా గౌరవించాలి అనే విషయాలు నేర్పించాలి. అదే సమయంలో ఆడపిల్లల భద్రతపై కుటుంబాలు జాగ్రత్తగా ఉండటం కూడా అవసరం” అని అన్నారు. మహిళల గొప్పతనాన్ని గుర్తు చేస్తూ, “మహిళలు తక్కువా ఎక్కువా అనే ప్రశ్నే లేదు. వాళ్లు ఎంతో గొప్పవారు. మగవాళ్లుగా మన బాధ్యత వాళ్లను రక్షించడం. ఆ రక్షణ గురించే శివాజీ గారు చెప్పారని నేను భావిస్తున్నాను” అని రక్షిత్ అట్లూరి స్పష్టం చేశారు. మొత్తానికి శివాజీ వాడిన పదాలపై అభ్యంతరం ఉన్నప్పటికీ, ఆయన ఉద్దేశాన్ని పూర్తిగా తప్పుబట్టలేమన్నదే రక్షిత్ అట్లూరి వాదన. ఈ వివాదంలో ఇండస్ట్రీ నుంచి బహిరంగంగా శివాజీకి మద్దతుగా నిలిచిన అరుదైన స్వరం ఇదే కావడం గమనార్హం.