అతికొద్ది మంది ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా సినిమాలు తీయడం వల్లే బాలీవుడ్ చిత్రాలు పరాజయాల్ని చవిచూస్తున్నాయని చెప్పారు సీనియర్ దర్శకనిర్మాత రాకేష్ రోషన్. మాస్ ప్రేక్షకులు హిందీ కథలతో ఏ మాత్రం కనెక్ట్ కాలేకపోతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇటీవలే 73వ వసంతంలోకి అడుగుపెట్టారాయన. ఈ సందర్భంగా సమకాలీన బాలీవుడ్ తీరుతెన్నులపై తన అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు.
జనరంజకమైన పాటల రూపకల్పన తగ్గిపోవడం కూడా బాలీవుడ్ సినిమాల పరాజయానికి ఓ కారణమని ఆయన విశ్లేషించారు. దక్షిణాది నుంచి వచ్చిన ‘పుష్ప’ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాల్లో పాటలన్నీ పాపులర్ అయ్యాయని, మాస్కు చేరువకావడంలో పాటలు ముఖ్య భూమిక పోషించాయని ఆయన తెలిపారు. ‘బాలీవుడ్ దర్శకనిర్మాతలు ఆధునికత కలబోసిన కథలపై ఎక్కువ దృష్టిపెడుతున్నారు.
తమ పక్కన ఉండే నలుగురు మిత్రులకు కథ నచ్చితే చాలనుకుంటున్నారు. అలాంటి కథలు సమాజంలోని ఒక్కశాతం మందికి మాత్రమే నచ్చుతాయి. మెజారిటీ ప్రేక్షకుల్ని మెప్పించాలంటే వారి ఇష్టాల్ని సంతుష్ట పరిచే కథల్ని ఎంచుకోవాలి. దక్షిణాది సినిమాల సక్సెస్‌కు కారణమదే. మాస్‌ను టార్గెట్ చేస్తూ మన సంస్కృతి, చరిత్ర మూలాల్ని తెలియజెప్పే కథలతో వాళ్లు ముందుకొస్తున్నారు’ అని రాకేష్ రోషన్ చెప్పారు. అలాగే దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ప్రచారం చేసే ధోరణి వల్ల నిర్మాతలకు ఆర్థికంగా నష్టం తప్ప పెద్దగా ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు.