గెటప్ శ్రీను హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘రాజు యాదవ్’. కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా దర్శకుడు కృష్ణమాచారి మాట్లాడుతూ ‘నా స్వస్థలం మహబూబ్‌నగర్. నీది నాది ఒకే కథ, విరాటపర్వం చిత్రాలకు అసోసియేట్‌గా పనిచేశాను. ‘రాజు యాదవ్’ ఓ వినూత్నమైన కాన్సెప్ట్. ప్రతి మనిషిలో ఓ లోపం ఉంటుంది. నటుడు అలీ ఓ సినిమాలో కోటి రూపాయల లాటరీ తగిలినప్పుడు నవ్వుతూనే చనిపోయే సీన్ ఒకటి ఉంటుంది. అలాగే క్రికెటర్ లక్ష్మీపతి బాలాజీకి చిన్నప్పుడు ఒక సర్జరీ జరగడం వల్ల ఆయన ముఖం ఎప్పుడూ నవ్వుతున్నట్లే ఉంటుంది. అలాంటి లోపంతో హీరో క్యారెక్టర్ రాసుకొని సినిమా చేశా’ అన్నారు. రాజు యాదవ్ పాత్రకు గెటప్ శ్రీను చక్కగా సరిపోయాడని, సహజమై నటనతో ఆకట్టుకున్నాడని ఆయన తెలిపారు. చంద్రబోస్ గీత రచన చేసి స్వయంగా ఆలపించిన పాటకు అద్భుతమైన స్పందన లభిస్తున్నదని, హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం, సురేష్ బొబ్బిలి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని, భవిష్యత్తులో సహజత్వంతో కూడిన కథలకు తాను ప్రాధాన్యం ఇస్తానని కృష్ణమాచార్య పేర్కొన్నారు.