‘ఖమ్మం, వరంగల్ సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా దర్శకుడు ఈ స్క్రిప్ట్ సిద్ధం చేశాడు. పరువు హత్యల తాలూకు ఎన్నో వార్తల్ని మనం విన్నాం. కానీ ఇంతటి దుర్మార్గం ఏ ప్రేమకథలోనూ జరగలేదనిపించింది’ అన్నారు దర్శకుడు వేణు ఊడుగుల. ఆయన రాహుల్ మోపిదేవితో కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. అఖిల్, తేజస్విని జంటగా నటించిన ఈ చిత్రానికి సాయిలు కంపాటి దర్శకుడు. ఈ నెల 21న విడుదలకానుంది. నిర్మాతలు బన్నీ వాసు, వంశీ నందిపాటి థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్మాతలు వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి విలేకరులతో మాట్లాడారు. వేణు ఊడుగుల మాట్లాడుతూ ‘అందరు అనుకుంటున్నట్లు ఈ సినిమాకు విషాదకరమైన ముగింపు ఉండదు. ప్రేక్షకులు మంచి ఫీల్‌తో బయటికొస్తారు. ఈ సినిమా చూశాక అమ్మాయిల ప్రేమ విషయంలో వారి పేరెంట్స్ కొందరిలోనైనా మార్పు వస్తుందని ఆశిస్తున్నా. యథార్థ ఘటన ఆధారంగా సినిమా తీసినప్పటికీ..ఎక్కడా ఊరు పేరు, బాధితులైన వ్యక్తుల పేర్లను చెప్పలేదు. 7/జీ బృందావన కాలనీ, సైరత్, ప్రేమిస్తే తరహాలో ఈ సినిమా గుర్తుండిపోతుంది.
దర్శకుడిగా యూవీ సంస్థలో నా తదుపరి చిత్రాన్ని చేయబోతున్నా. హీరో ఎవరనేది నిర్మాణ సంస్థే వెల్లడిస్తుంది’ అన్నారు. సంఘటన జరిగిన ప్రాంతంలోనే ఈ సినిమా షూటింగ్ చేశామని, ఆ గ్రామంలోని వారినే కొందరిని చిన్న చిన్న పాత్రలకు తీసుకున్నామని, 15ఏళ్లుగా అక్కడే సమాధి చేయబడిన ఓ ప్రేమకథను ఈ సినిమా ద్వారా ఆవిష్కరిస్తున్నామని, ప్రస్తుతానికి తెలుగు రాష్ర్టాల్లోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని మరో నిర్మాత రాహుల్ మోపిదేవి పేర్కొన్నారు.