Sourav Ganguly Biopic | భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బెంగాల్ దాదా సౌరవ్ గంగూలీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక బయోపిక్ ‘దాదా: ది సౌరవ్ గంగూలీ స్టోరీ’ (Dada: The Sourav Ganguly Story). ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కోల్‌కతాలో శరవేగంగా సాగుతోంది. ముంబై షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్, ప్రస్తుతం కోల్‌కతాలో 15 రోజుల సుదీర్ఘ షెడ్యూల్‌ను ప్రారంభించింది. గంగూలీ జీవిత ప్రయాణంతో ముడిపడి ఉన్న పలు కీలక ప్రాంతాలలో ఈ చిత్రీకరణ జరుగుతున్నట్లు సమాచారం.
ఈ చిత్రంలో సౌరవ్ గంగూలీ పాత్రను బాలీవుడ్ విలక్షణ నటుడు రాజ్‌కుమార్ రావు పోషిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కోల్‌కతాలో జరుగుతుండగా.. దీనికి సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. రాజ్‌కుమార్ రావు ఎరుపు రంగు ట్రాక్‌సూట్ ధరించి ‘దాదా’ లుక్‌లో కనిపించి అభిమానులను అలరించాగా. కోల్‌కతా వీధుల్లో సాగిన గంగూలీ తొలినాళ్ల కష్టాల నుంచి లార్డ్స్ మైదానంలో టీ-షర్ట్ విదిల్చిన చారిత్రాత్మక క్షణం వరకు, ‘గాడ్ ఆఫ్ ది ఆఫ్-సైడ్’ ప్రయాణాన్ని దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తుంది. ఐపీఎల్ సీజన్ ముగియడంతో ఈడెన్ గార్డెన్స్ మైదానంతో పాటు దుఖీరామ్ క్రికెట్ కోచింగ్ సెంటర్లో కూడా కీలకమైన సీన్స్ షూట్ చేస్తున్నారు. విశేషం ఏమిటంటే.. సౌరవ్ గంగూలీ స్వయంగా తన నివాసంలో మరియు ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన షూటింగ్ సమయాల్లో హాజరై చిత్ర యూనిట్‌ను పర్యవేక్షించినట్లు సమాచారం.
ఈ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ సంగీత దర్శకుడు ప్రీతమ్ సంగీతాన్ని అందిస్తున్నారు. బెంగాలీ సంస్కృతి, నేటివిటీ ఉట్టిపడేలా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. గంగూలీ భార్య డోనా గంగూలీ పాత్రలో తాన్యా మణిక్తల నటిస్తోంది.