సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమాల మధ్య ఏమాత్రం విరామం తీసుకోవడం లేదు. డబ్బుఏండ్లకు పైబడిన వయసులో కూడా అలుపెరుగని సినీ ప్రయాణాన్ని సాగిస్తున్నారు. ఇటీవలే ‘కూలీ’తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టారు. అనంతరం కొంచెం గ్యాప్ తీసుకొని మానసిక ప్రశాంతత కోసం ఇటీవలే హిమాలయాల సందర్శనకు వెళ్లొచ్చారు. ప్రస్తుతం ఆయన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ‘జైలర్-2’ సినిమా చేస్తున్నారు. దీనితర్వాత కమల్‌హాసన్‌తో కలిసి ఓ సినిమాకు ప్లాన్ చేశారు. మంచి కథ కుదిరితే తామిద్దరం కలిసి నటిస్తామని ఈ సూపర్‌స్టార్స్ ఇద్దరూ ఇటీవలే వెల్లడించారు. అయితే ఈ సినిమా విషయంలో ఇంకా ఎలాంటి ప్రోగ్రెస్ లేకపోవడంతో ఇప్పట్లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం లేదంటున్నారు.
ఈ నేపథ్యంలో ‘జైలర్-2’ తర్వాత రజనీకాంత్ చేయబోయే సినిమా ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం తనకు ‘అరుణాచలం’ వంటి మెమొరబుల్ మూవీని అందించిన దర్శకుడు సుందర్.సితో రజనీకాంత్ సినిమా చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ దిశగా చర్చలు జరిగాయంటున్నారు. ఇదేగనుక నిజమైతే దాదాపు 28 ఏళ్ల విరామం తర్వాత రజనీ-సుందర్.సి కాంబో రిపీట్ అయినట్లవుతుంది. 1997లో వచ్చిన ‘అరుణాచలం’ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. ద్విపాత్రాభినయంలో రజనీకాంత్ నటన అందరినీ ఆకట్టుకుంది. ‘దేవుడు శాసిస్తాడు. ఈ అరుణాచలం’ పాటిస్తాడు వంటి సంభాషణలు పాపులర్ అయ్యాయి.