సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘కూలీ’ ఆగస్ట్ 14న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాగార్జున, అమీర్‌ఖాన్ ముఖ్య పాత్రల్ని పోషిస్తుండటంతో పాన్ ఇండియా స్థాయిలో సినిమాపై భారీ హైప్ నెలకొని ఉంది.
ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన వచ్చింది. తాజాగా ‘పవర్‌హౌజ్’ అంటూ సాగే మూడో గీతాన్ని విడుదల చేశారు. ‘ఉర్రూతలూగు సింగమే, కొట్టాడో ఖేల్ ఖతమే, ఈ కూలీ పవర్‌హౌజ్’ అంటూ రజనీకాంత్ ఇమేజ్ను ఎలివేట్ చేస్తూ ఈ పాట సాగింది. అనిరుధ్ రవిచందర్ స్వరపరచిన ఈ గీతాన్ని రాంబాబు గోసాల రచించారు. ఏషియన్ మల్టీప్లెక్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నది. ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్ రవిచందర్, నిర్మాత: కళానిధి మారన్.