International Film Festival of India | భారతీయ చలనచిత్ర పరిశ్రమకు సుదీర్ఘకాలం పాటు విశిష్ట సేవలు అందించిన సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు (Rajinikanth) అరుదైన గౌరవం దక్కనుంది. ఇటీవల నట జీవితంలో 50 ఏళ్ల ఘన ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా 56వ అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవం (IFFI – International Film Festival of India) ముగింపు వేడుకలో రజనీకాంత్‌ను సన్మానించనున్నారు. ఈ సన్మానం ఐఎఫ్ఎఫ్ఐకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుండగా.. గోవా వేదికగా నవంబర్ 20 నుంచి 28 వరకు ఈ వేడుక జరుగనుంది.
బస్ కండక్టర్‌గా జీవితం ప్రారంభించిన శివాజీ రావు గైక్వాడ్ అలియాస్ రజనీకాంత్… 1975లో లెజెండరీ దర్శకుడు కె. బాలచందర్ రూపొందించిన ‘అపూర్వ రాగంగళ్’ చిత్రంతో నట జీవితాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా, తనదైన స్టైల్‌తో, విలక్షణమైన పాత్రలతో కోట్లాది మంది అభిమానుల హృదయాలలో చెరగని ముద్ర వేశారు. తన యాక్షన్, స్టైలింగ్‌తో ఇండియా అంతటా సూపర్‌స్టార్‌గా గుర్తింపు సాధించాడు.
ఇక ఈ IFFI వేడుకల్లో గురు దత్, రాజ్ ఖోస్లా, రిత్విక్ ఘటక్, పి. భానుమతి, భూపేన్ హజారికా వంటి పలు దిగ్గజ కళాకారుల శత జయంతి వేడుకలు కూడా జరగనున్నాయి. ఈ తొమ్మిది రోజుల ఉత్సవంలో 81 దేశాల నుండి 240కి పైగా చలనచిత్రాలను ప్రదర్శించనున్నారు.