Rajinikanth | సూపర్‌స్టార్ రజనీకాంత్- స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో కూలీ అనే భారీ కమర్షియల్ చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శృతి హాసన్ లాంటి స్టార్స్‌తో పాటు బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్ ఖాన్ ‘దాహా’ పాత్రలో గెస్ట్ క్యారెక్టర్‌గా కనిపించనున్నారు. పూజా హేగ్డే ఓ స్పెషల్ డ్యాన్స్ తో అలరించనుంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీని ₹350‑375 కోట్లు ఖర్చుపెట్టి రూపొందించినట్టు సమాచారం. ఆగస్ట్ 14న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదలై సందడి చేయనుంది.
అయితే ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఆగస్ట్ 2న చెన్నైలో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమంలో రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కూలీ చిత్రానికి లోకేష్ కనగరాజే హీరో, అనిరుధ్ భారతీయ సినీ పరిశ్రమలో ఏకైక రాక్‌స్టార్ అంటూ రజనీకాంత్ ప్రశంసలు కురిపించారు. ఇక సత్యరాజ్‌కు నాకు భావజాలం విషయంలో భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. ఆయన తన మనసులో మెదిలే ప్రతి విషయాన్ని బయటకు మాట్లాడగలరు. అలాంటి వారిని మనం నమ్మోచ్చు. కాని మనసులో పెట్టుకునే వారిని నమ్మడం చాలా డేంజర్. నాగార్జున ఈ వయసులోనూ చాలా అందంగా కనిపిస్తున్నారని.. నా జుట్టు అంతా ఊడిపోయింది, మీ ఫిట్నెస్ రహస్యం ఏమిటి అని అడిగితే వ్యాయామం వల్లే ఇలా ఉన్నానని నాగ్ అన్నారని, ఇందులో ఆయన నెగెటివ్ రోల్లో చాలా అద్భుతంగా నటించారంటూ తలైవా ప్రశంసలు కురిపించారు.
ఇక చిన్నతనంలో నా మిత్రుడు తన గోల్డ్ చైన్ ఇచ్చి.. నువ్వు సినిమాల్లో నటించమని చెప్పాడని అందుకే నేను ఇక్కడ ఉన్నానని రజనీ తన మిత్రుడు రాజ్ బహదూర్ గురించి ప్రస్తావించారు. మీకు ఎంత డబ్బు, కీర్తి వచ్చినా.. ఇంట్లో మన:శాంతి, బయట రెస్పెక్ట్ లేకపోతే ఏది విలువైనది కాదు అని రజనీకాంత్ పేర్కొన్నారు. ఇక ఒకరోజు నేను రోడ్డుపై నిల్చొని ఉన్నప్పుడు ఓ వ్యక్తి నన్ను పిలిచి, నా లగేజ్ టెంపో వరకు తీసుకెళతావా అన్నాడు. దానికి నేను సరే చెప్పాను. అతన్ని పరిశీలించి చూస్తే తెలిసిన వ్యక్తిలా కనిపించాడు. కొద్దిగా ఆలోచిస్తే ఇద్దరం ఒకే కాలోజేలో చదువుకున్నట్టు గుర్తుకు వచ్చింది. అయితే అప్పుడు అతను నా చేతిలో రూ.2 పెట్టి ఆ రోజుల్లో నీకున్న గర్వం ఎవరికి లేదు, ఆ రోజులు గుర్తున్నాయా అని అడిగితే కన్నీళ్లు ఆగలేదు. అది జీవితంలో చాలా బాధపడిన సందర్భం అని అన్నారు రజనీకాంత్.