Rajinikanth – Sridevi | సౌత్‌లో తిరుగులేని స్టార్డం సంపాదించిన రజినీకాంత్ , నార్త్ ఇండియాలోను తన సత్తా చాటిన శ్రీదేవి కలిసి వెండితెరపై చరిత్ర సృష్టించారు. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు ఎన్నో ఉన్నా, వీరి అనుబంధం గురించి వినిపించే కథలు ఇంకా ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. శ్రీదేవి బోనీ కపూర్‌ను పెళ్లి చేసుకోవడానికి ముందు మిథున్ చక్రవర్తితో ప్రేమలో ఉందన్న విషయం తెలిసిందే. అయితే, కొంతమందికి తెలియని అంశం ఏమిటంటే… శ్రీదేవి మొదటగా రజినీకాంత్‌కి చాలా దగ్గరగా ఉండేదట. ఈ విషయాన్ని లెజెండరీ దర్శకుడు కె. బాలచందర్ ఓ పాత ఇంటర్వ్యూలో వెల్లడించారు.
శ్రీదేవి హీరోయిన్గా నటించిన ‘మూండ్రు ముడిచు’ చిత్రంతో తమిళ్లో రజినీకాంత్‌కు హీరో పాత్రలు రావడం మొదలైంది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి 22 సినిమాల్లో నటించారు. తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఈ ఇద్దరు కలిసి పని చేశారు. అయితే 16 చిత్రాల్లో శ్రీదేవి నేరుగా రజినీ సరసన హీరోయిన్గా నటించింది. తెలుగులో విజయ నిర్మల దర్శకత్వం వహించిన ‘రామ్ రాబర్ట్ రహీం’ చిత్రంలో కూడా ఇద్దరూ నటించారు. చివరిసారిగా బాలీవుడ్లో వచ్చిన ‘ఫరిష్టే’ అనే సినిమాలో కలిసి కనిపించారు.
కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్న కథనాల ప్రకారం, శ్రీదేవిని రజినీకాంత్ ఎంతో ఇష్టపడేవాడట. ఒకసారి శ్రీదేవి గృహ ప్రవేశం సందర్భంగా, తన మనసులోని భావాలను చెప్పాలనుకున్నాడట రజినీకాంత్. శ్రీదేవికీ రజినీ అంటే ప్రత్యేక అభిమానం ఉండేదని అంటారు. అయితే రజినీకాంత్ ఇంట్లో అడుగుపెట్టిన క్షణానికే కరెంట్ పోవడం , ఇల్లంతా చీకటి కావడం చెడు శకునంగా భావించిన రజినీ, తన మనసులో మాటను బయటపెట్టకుండా అక్కడి నుండి నిశ్శబ్దంగా వెళ్లిపోయాడట. రజినీకాంత్‌కి శకునాల పట్ల విశ్వాసం ఎక్కువగా ఉండేదట. అదే సమయంలో దైవ భక్తి కూడా చాలా ఎక్కువే. అయితే తను ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే కరెంట్ పోవడంతో చెడు శకునంగా భావించి తన మనసులోని భావాలను బయటపెట్టకుండానే వెనక్కు తగ్గాడన్న మాట.
ఇంకో కథనం ప్రకారం, శ్రీదేవి తల్లి కూడా రజినీ-శ్రీదేవి అనుబంధాన్ని గమనించి, పెళ్లి విషయాన్ని ఆలోచించారట. గృహ ప్రవేశం రోజున రజినీని పిలిపించి, తమ అభిప్రాయాన్ని చెప్పాలని అనుకున్నారు. కానీ అదే సమయంలో కరెంట్ పోవడం, ఇల్లంతా చీకటి కావడం ఆమెకు నచ్చలేదట. సెంటిమెంట్లపై గాఢమైన నమ్మకం ఉన్న శ్రీదేవి తల్లి , దీన్ని అపశకునంగా భావించి, పెళ్లి ఆలోచనను మానేసినట్టు చెబుతారు. వాస్తవానికి, ఈ విషయం రజినీకాంత్ కానీ, శ్రీదేవి కానీ ఎప్పటికీ బహిరంగంగా వెల్లడించలేదు. కానీ బాలచందర్ వంటి ప్రముఖ దర్శకుడు ఈ విషయాన్ని రివీల్ చేయగా, చలనచిత్ర వర్గాల్లో కొందరు పలు సందర్భాలలో దీని గురించి ముచ్చటించుకున్నారు.