75ఏండ్ల వయసులో క్షణం తీరిక లేకుండా సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు సైతం ప్రేరణగా నిలుస్తున్నారు సూపర్‌స్టార్ రజనీకాంత్. ఆయన ‘కూలీ’ రేపు విడుదల కానుంది. ‘జైలర్ 2’ నిర్మాణ దశలో ఉంది. ఇంతలోనే మరో సినిమాకు తలైవా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ సారి రజనీని మెప్పించిన దర్శకుడెవరో కాదు, రీసెంట్ బ్లాక్‌బస్టర్ ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ కథానాయకుడు.. ‘శశికుమార్’.
తమిళంలో శశికుమార్‌ది భిన్నమైన ఇమేజ్. అటు నటుడిగా, ఇటు దర్శకునిగా, మరోవైపు నిర్మాతగా బహుముఖాల్లో ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారాయన. ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ తర్వాత హీరోగా కూడా శశికుమార్‌కి అవకాశాలు క్యూకట్టాయి. కానీ ఆయన మాత్రం వాటన్నింటినీ పక్కన పెట్టి, రజనీకాంత్‌కి కథ తయారు చేసే పనిలోనే బిజీగా ఉన్నారట. ఎట్టకేలకు కథ రెడీ అయ్యింది.
ఇటీవలే తలైవాకు కథ వినిపించారట. ఆయనక్కూడా కథ బాగా నచ్చడంతో ‘We are doing it..’ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. శశికుమార్ డైరెక్ట్ చేసిన సుబ్రమణియపురం, ఈసన్ సినిమాలు తమిళనాట బాగా ఆడాయి. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఆయన మెగా ఫోన్ పట్టనున్నారు. ఈ సారి ఏకంగా సూపర్‌స్టార్‌నే డైరెక్ట్ చేయబోతున్నారాయన. నిజానికి రజనీని డైరెక్ట్ చేయడం శశికుమార్ కల. ఇన్నాళ్లకు ఆ కల నెరవేరిందంటూ కోలీవుడ్‌లో పలువురు శశికుమార్ సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు. ‘జైలర్ 2’ తర్వాత రజనీ చేసే సినిమా ఇదేనని తెలుస్తున్నది.