Rajinikanth | ‘జై భీమ్’ చిత్రంతో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు తమిళ దర్శకుడు టీజే జ్ఞానవేల్. సామాజిక సందేశంతో రూపొందించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలందుకుంది. ఆయన తదుపరి చిత్రంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటించబోతున్న విషయం తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనుంది. రజనీకాంత్ నటిస్తున్న 170వ చిత్రమిది. త్వరలో ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లనుంది.
అమితాబ్‌బచ్చన్, ఫహాద్ ఫాజిల్ వంటి అగ్ర నటులు ఈ సినిమాలో భాగం కాబోతున్నారు. తెలుగు హీరో నాని సైతం ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా తాలూకు లుక్ టెస్ట్‌ను రజనీకాంత్ పూర్తి చేశారని తమిళ సినీ వర్గాల్లో వినిపిస్తున్నది. ఈ సినిమాలో సామాజిక సమస్యలపై పోరాడే యోధుడిగా రజనీకాంత్ కనిపించబోతున్నారని సమాచారం. సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలతో పవర్ఫుల్ సోషల్‌డ్రామాగా దర్శకుడు టీజే జ్ఞానవేల్ ఈ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. రజనీకాంత్ తాజా చిత్రం ‘జైలర్’ ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకురానున్న విషయం తెలిసిందే.