Rajinikanth- Kamal Hassan | దక్షిణ భారత సినీ ప్రపంచంలో రజినీకాంత్, కమల్ హాసన్ ఇద్దరూ అత్యంత ప్రభావవంతమైన దిగ్గజ నటులు. వీరిద్దరినీ సినిమా రంగానికి పరిచయం చేసిన వ్యక్తి దర్శకుడు కె. బాలచందర్. ఆయన దర్శకత్వంలో వీరిద్దరూ కలిసి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. 1985 వరకు వీరు కలిసి 15కి పైగా సినిమాల్లో నటించగా, ఆ తర్వాత మాత్రం ఇద్దరూ కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. అంటే వారి కాంబోలో సినిమా రాక దాదాపు 40 ఏళ్లు పూర్తైంది. ఇటీవల కమల్ హాసన్ రాజకీయ రంగంలోనూ తన సత్తా చాటుతున్నారు. డిఎంకే పార్టీ మద్దతుతో రాజ్యసభ ఎంపీగా ఎంపికయ్యారు. సినిమాలు, రాజకీయాలు రెండింటినీ సమానంగా బ్యాలెన్స్ చేస్తున్న ఆయన ఈ వయస్సులోను చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
2020లో రజనీకాంత్, కమల్ కలిసి లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సినిమా చేయాలన్న ప్రణాళికలు ఉండగా, కోవిడ్ కారణంగా ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. తర్వాత లోకేష్, కమల్ హాసన్‌తో విక్రమ్ సినిమా తీశారు . అది బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. ఆ తరువాత రజినీకాంత్‌తో కూలీ అనే చిత్రం తెరకెక్కించాడు లోకేష్. ఇటీవలే విడుదలైన ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. మరోవైపు లోకేష్ కనగరాజ్ తన తదుపరి సినిమాను ఖైది 2గా కాకుండా, రజినీ- కమల్ హాసన్ కలిసి నటించే మల్టీ స్టారర్ ప్రాజెక్టుగా రూపొందించనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిలిమ్స్ (కమల్ హాసన్) మరియు రెడ్ జెయింట్ మూవీస్ (ఉదయనిధి స్టాలిన్) సంయుక్తంగా నిర్మించనున్నట్టు సమాచారం. అయితే, దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇది నిజమైతే, 40 ఏళ్ల విరామం తర్వాత వీరు కలిసి నటించడం కేవలం తమిళ సినీ రంగానికే కాదు, మొత్తం దక్షిణ భారత సినిమా పరిశ్రమకే ఒక చారిత్రాత్మక ఘటనగా నిలిచే అవకాశముంది. లోకేష్ కనకరాజ్ రూపొందించిన ‘కూలీ’పై వచ్చిన విమర్శల నేపథ్యంలో ఈసారి మరింత బలమైన కథతో ముందుకు రావాలని భావిస్తున్నారట. మరోవైపు కమల్ హాసన్ ‘విక్రమ్’ తర్వాత చేసిన రెండు సినిమాలు ఫ్లాప్ కాగా, ఇటీవల విడుదలైన ‘కల్కీ’ మాత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ మల్టీ స్టారర్ సినిమాను ఖైదీ 2 కంటే ముందే పూర్తి చేయాలని లోకేష్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశముంది.