Superstar Rajinikanth | తనపై జరుగుతున్న ట్రోలింగ్ గురించి అసహనం వ్యక్తం చేశాడు నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్. తాజాగా చెన్నైలో జరిగిన ‘ధర్మన్’ సినిమా లాంచ్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, బహిరంగంగా మాట్లాడాలంటే ఇప్పుడు భయంగా ఉందని చెప్పారు. తాను మాట్లాడినా సమస్యే, మౌనంగా ఉన్నా సమస్యే అవుతోందని రజినీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. వేదికపైకి మాట్లాడమని పిలిస్తే భయంగా ఉందని, ఎందుకంటే తాను మాట్లాడితే అది తనకు కాకపోయినా మీకు సమస్య అవుతుందని ఆయన అన్నారు. ఒకవేళ మౌనంగా ఉంటే మౌనంగా ఎందుకు ఉన్నాడు అని ఎగతాళి చేస్తారని చెప్పారు. అదే మాట్లాడితే ఇప్పుడు ఎందుకు మాట్లాడాడు, అసలు మాట్లాడకుండా ఉండాల్సింది అని విమర్శిస్తారని తెలిపారు.
ఇక చాలా ఏళ్ల తర్వాత తనకు ఒక విషయం అర్థమైందని, మనల్ని ఇష్టపడని వాళ్లకు మనం ఏం చేసినా నచ్చదని, ఇష్టపడేవాళ్లు మనం ఏం చేసినా నచ్చుతుందని అనుకోవడం మూర్ఖత్వమని రజినీ అన్నారు. ప్రతి ఒక్కరూ మనల్ని మెచ్చుకుంటారని ఆశించడం సరికాదని, జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. ఇక సినిమాల విషయానికి వస్తే, రజినీకాంత్ ‘ధర్మన్’ చిత్ర షూటింగ్ గురువారం నుంచి ప్రారంభించబోతున్నారు. ఈ సినిమాను కమల్ హాసన్ నిర్మిస్తుండగా అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించబోతున్నాడు.