Rajinikanth |తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ అనారోగ్యానికి లోనయ్యారు అనే వార్త దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులను కలవరానికి గురిచేసింది. సోషల్ మీడియా ద్వారా రజనీ కోలుకోవాలని ప్రార్థిస్తూ పోస్టులు కూడా పెడుతున్నారు. సోమవారం రాత్రి తీవ్ర కడుపునొప్పితో రజనీ చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు హృదయ నాళంలో సమస్యను గుర్తించి, రజనీకి స్టెంట్ వేశారు.
మంగళవారం ఉదయం ఆస్పత్రి వర్గాలు రజనీకాంత్ ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులెటిన్‌ని విడుదల చేశాయి. హృదయ నాళానికి సంబంధించిన చికిత్స చేసినట్టు ఈ బులెటిన్‌లో వారు వెల్లడించారు. రజనీ ఆరోగ్యం నిలకడగానే ఉందనీ, మరో రెండురోజుల్లో డిశ్చార్జ్ అవుతారని వారు బులెటన్ ద్వారా పేర్కొన్నారు. మరోవైపు ఈ విషయంపై రజనీకాంత్ భార్య లత కూడా స్పందించారు.
రజనీకాంత్ ఆరోగ్యం మెరుగుపడిందని, నిలకడగానే ఉన్నారని అభిమానులకు ఆమె తెలియజేశారు. రజనీకాంత్ నటించిన ‘వెట్టయాన్’ సినిమా ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇదిగాక ‘కూలీ’ అనే సినిమా కూడా చేస్తున్నారాయన.