Rajinikanth | సూపర్ స్టార్ రజినీకాంత్ నటన, స్టైల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయనలోని మంచితనాన్ని చూసి ఎవ్వరైనా మెచ్చుకోవల్సిందే. తాజాగా ‘తలైవా’ రజినీ గురించి అక్కినేని నాగార్జున ఒక హృద్యమైన విషయాన్ని వెల్లడించారు.లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కూలీ’ చిత్రంలో రజినీకాంత్‌తో పాటు నాగార్జున కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం షూటింగ్ అనుభవాలను గుర్తుచేసుకుంటూ నాగార్జున రజినీ మంచితనాన్ని ప్రశంసించారు.థాయ్‌లాండ్‌లో 17 రోజులు రాత్రి వేళల్లో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించాం. దాదాపు 350 మందితో కూడిన బృందం ఎంతో శ్రమించింది.
చివరి రోజు, రజినీ గారు అందరినీ పిలిచి ప్రతి ఒక్కరికి గిఫ్ట్ ప్యాకెట్లు ఇచ్చారు. ఇంటికి వెళ్లినప్పుడు పిల్లల కోసం ఏదైనా కొనండి అంటూ ప్రేమగా చెప్పారు. అలాంటి మనసున్నవారు చాలా అరుదుగా ఉంటారు, అని నాగార్జున భావోద్వేగంతో చెప్పారు.ఇంకా ఆయన పేర్కొన్న అంశం ఒకటి అందరినీ ఆకట్టుకుంటోంది. ఇన్నేళ్ల అనుభవం ఉన్నా, రజినీ గారు ప్రతి సీన్‌కి ముందు డైలాగ్స్‌ను పక్కకు వెళ్లి ప్రాక్టీస్ చేస్తుంటారు. ఆయనలో ఉన్న అంకితభావం నిజంగా అందరికి ప్రేరణగా ఉంటుంది,” అని అన్నారు. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘కూలీ’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగం కాకుండా ఒక స్టాండ్ అలోన్ సినిమా అని దర్శకుడు స్వయంగా స్పష్టం చేయడంతో ఆసక్తి మరింత పెరిగింది.
రజినీకాంత్ కెరీర్లో ఇది 171వ సినిమా. ఓ తమిళ చిత్రానికి సంబంధించి అత్యధిక ఓవర్సీస్ రేటుకు అమ్ముడై, ఈ సినిమా ఇప్పటికే ఓ రికార్డు కూడా సృష్టించింది. ఈ చిత్రంలో రజినీ, నాగార్జునతో పాటు ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, శ్రుతి హాసన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్ లాంటి స్టార్ క్యాస్ట్ ఉండటం విశేషం. ముఖ్యంగా రజినీ–సత్యరాజ్ లు సుమారు 38 ఏళ్ల తర్వాత ఒకే సినిమాలో నటిస్తున్నారు. వీరిద్దరూ చివరిసారిగా 1986లో వచ్చిన ‘మిస్టర్ భరత్’లో కలిసి కనిపించారు.అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఆగస్టు 14న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రానికి పోటీగా వార్ 2 విడుదల అవుతున్న విషయం విదితమే.