Rajinikanth | తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా తలైవా కెరీర్లోనే బెస్ట్ మూవీగా నిలిచింది. ఇక ఈ మూవీ సీక్వెల్ ఇప్పుడు సెట్స్‌పైకి వెళ్లింది. ఇటీవలే కూలీ సినిమాను పూర్తి చేసిన రజనీకాంత్ ‘జైలర్ 2’ సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యాడు. తమిళ్లోనే కాకుండా జైలర్ 2 అన్ని భాషల ప్రేక్షకుల్లోనూ అంచనాలు పెంచింది ఈ సంవత్సరం జనవరి 14న సంక్రాంతి పండుగ సందర్భంగా జైలర్ 2 చిత్రానికి సంబంధించిన ప్రోమో వీడియో విడుదల కాగా, ఇందులో రజినీకాంత్, నెల్సన్ దిలీప్, అనిరుధ్ కనిపించి అలరించారు
మొదటి భాగంలాగే రెండవ భాగం కూడా యాక్షన్ సన్నివేశాలతో రచ్చ రచ్చ చేయబోతున్నట్టు తెలుస్తోంది. జైలర్ 2 షూటింగ్ గత నెలలోనే ప్రారంభం కాగా, తొలి దశ షూటింగ్ చెన్నైలో జరిగింది, రెండవ దశ షూటింగ్ కేరళలో జరుగుతోంది. రజినీకాంత్, రమ్యకృష్ణ, మిర్నా నటించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక జైలర్ మొదటి భాగంలో అతిథి పాత్రల్లో నటించిన మోహన్ లాల్, శివరాజ్ కుమార్ జైలర్ 2లో కూడా నటిస్తారని చెబుతున్నారు. సినిమాకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. రజనీకాంత్‌తో వేట్టయాన్ సినిమాలో నటించిన మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్‌ను ఈ సినిమాలో ముఖ్య పాత్ర కోసం ఎంపిక చేశారనే వార్తలు ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
కేరళలో జరుగుతున్న షెడ్యూల్లో రజనీకాంత్‌తో పాటు ఆయన పాల్గొంటున్నాడని తెలుస్తోంది. పుష్ప 2 సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఫహద్.. షెకావత్‌గా అదరగొట్టాడు. ఆయనకి అనేక ఆఫర్స్ తలుపు తడుతున్నాయి. హిందీ సినిమాల్లోనూ ఈయనకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. జైలర్ 2 సినిమాలో కూడా అతనికి అవకాశం వచ్చిందని అంటున్నారు. ఇంతకు ముందు వేటైకారన్ సినిమాలో రజినీకాంత్ తో కలిసి నటించారు. జైలర్ 2 కోసం వీరిద్దరూ మళ్ళీ కలిసి నటిస్తున్నారనే వార్త కోలీవుడ్ లో వైరల్ అవుతోంది. ఇందులో ఫహద్ విలన్‌గా నటిస్తాడని టాక్. ఈ సినిమాను వచ్చే ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.