Rajinikanth | భారత సినీ ప్రపంచంలో “సూపర్ స్టార్” అంటే ముందుగా గుర్తొచ్చే పేరు రజనీకాంత్‌ది. పరిచయం అవసరం లేని ఈ మహా నటుడు తన స్టైల్, మాట తీరు, వినయం, సరళమైన జీవనశైలి అతనిని ఉన్నత స్థాయికి చేర్చాయి. ఈ రోజు రజనీకాంత్ 75వ పుట్టినరోజు పురస్కరించుకొని, ఆయనకి అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 1950 డిసెంబర్ 12న బెంగళూరులోని మధ్యతరగతి మారాఠీ కుటుంబంలో శివాజీ రావు గైక్వాడ్ గా జన్మించిన రజనీ చిన్నతనంలోనే కష్టాలు ఎదుర్కొన్నారు. పోలీస్ కానిస్టేబుల్ అయిన తండ్రి రామోజీరావు, గృహిణి తల్లి జిజాబాయికి జన్మించిన రజనీకి చిన్న వయసులోనే తల్లి కోల్పోవడం పెద్ద దెబ్బైంది. కుటుంబ పరిస్థితులు క్షీణించడంతో చదువు పూర్తయ్యాక బెంగళూరు ట్రాన్స్‌పోర్ట్‌లో బస్ కండక్టర్‌గా ఉద్యోగం చేపట్టారు. అయితే నటనపై ఉన్న ఆయన ప్రేమ మాత్రం ఎప్పుడూ తగ్గలేదు. జీతం నుంచి సొమ్ము సేవ్ చేసి నటనా తరగతుల్లో చేరి తన కలను కొనసాగించారు.
ఈ నటనాభిలాష ఆయనను చివరకు చెన్నై ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వరకు తీసుకెళ్లింది. అక్కడే ఆయన జీవితంలో కీలక మలుపు . దర్శకుడు కే. బాలచందర్. రజనీ ఎనర్జీ, నటనను చూసి “ ఇక నుండి నీ పేరు రజనీకాంత్. నువ్వు స్టార్ అవుతావు” అని చెప్పి సినీరంగంలోకి పరిచయం చేశారు. అలా 1975లో అపూర్వ రాగాలు ద్వారా తొలిసారి స్క్రీన్‌పై కనిపించిన రజనీ, చిన్న పాత్రలోనే ప్రేక్షకులను ఆకర్షించాడు. 1975–1978 మధ్య 50కి పైగా సినిమాల్లో నటిస్తూ నెగటివ్ రోల్స్, గంభీర పాత్రలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. 1978లో బైరవి విడుదలై రజనీకి హీరోగా మంచి పేరు తెచ్చింది.. అక్కడినుంచే “సూపర్ స్టార్” బిరుదు పాపులర్ అయింది. తర్వాత అన్నామలై, ముళ్ల మలార్, Aarilirunthu Arubathu Varai, మూండ్రు ముగం వంటి సినిమాలతో ఆయన నటనా పటిమని చూపించారు. 1980–1990 మధ్య రజనీ సౌత్‌లో దేవుడి స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న కాలం. బాషా (1995) అయితే రజనీకాంత్‌కి కెరీర్లోనే ఒక మైలురాయి. “ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టే” వంటి డైలాగ్స్ ఆయన స్టార్‌డమ్‌ను ఆకాశానికెత్తాయి.
తర్వాత శివాజీ (2007), ఎంథిరన్/రోబో (2010), 2.0 (2018) వంటి భారీ చిత్రాలతో రజనీ పాన్-ఇండియా, అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. హిందీ చిత్రాల్లోనూ నటించి దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందారు. SP ముత్తురామన్-రజనీ కాంబో 20కి పైగా హిట్లు ఇచ్చి తమిళ సినీరంగంలో ఐకానిక్ జంటగా నిలిచింది. యాక్షన్ సీన్స్ విషయానికి వస్తే, రజనీ స్టంట్స్ చాలా వరకు స్వయంగా చేయడం ఆయన ప్రత్యేకత. 2011లో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చినా, సింగపూర్‌లో చికిత్స తర్వాత రజనీ మళ్లీ నిలబడటం ఆయన మనోబలానికి నిదర్శనం. 2014లో సోషల్ మీడియాలోకి వచ్చిన రోజే లక్షన్నర ఫాలోవర్లను సంపాదించడం రజనీ గ్లోబల్ పాపులారిటీని మరోసారి నిరూపించింది. జపాన్‌లో ‘ముత్తు’ రికార్డులు, ఇటీవలి ‘జైలర్’ బ్లాక్‌బస్టర్ ₹500 కోట్లు దాటడం ఆయన చరిష్మాని చాటి చెప్పాయి.
డిసెంబర్ 12, 2025కి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న రజనీ అభిమానులు ప్రపంచవ్యాప్తంగా పండుగలా జరుపుకుంటున్నారు. ప్రత్యేక పోస్టర్లు, భారీ కటౌట్లు, సామాజిక సేవ కార్యక్రమాలతో రజనీ జన్మదినం జరుపుకుంటున్న వేళ, ఆయన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘నరసింహ/పడయప్ప’ ప్రత్యేక రీరిలీజ్ కూడా అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని రేపుతోంది. 75 ఏళ్లు వచ్చినా రజనీకాంత్ స్టైల్, ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ అదే స్థాయిలో కొనసాగుతూ ఉండటం విశేషం.