Director Atlee | తమిళ అగ్ర దర్శకుడు అట్లీ ఓ సంచలన కాంబినేషన్‌ను తెరపై తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ముంబయి సినీ వర్గాల్లో వినిపిస్తున్నది. తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ కాంబినేషన్లో ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించడానికి అట్లీ ప్రయత్నాల్ని ముమ్మురం చేశారని సమాచారం. ‘జవాన్’ చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు దర్శకుడు అట్లీ. షారుక్‌ఖాన్ నటించిన ఈ చిత్రం వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.
అట్లీ తన తదుపరి చిత్రాన్ని సల్మాన్‌ఖాన్‌తో చేయబోతున్నాడు. సన్‌పిక్చర్స్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రంలో రజనీకాంత్ కూడా భాగం కానున్నారని, ఇద్దరు సూపర్‌స్టార్స్‌ను దృష్టిలో పెట్టుకొని అట్లీ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.
వచ్చే నెలలో రజనీకాంత్, సల్మాన్‌ఖాన్‌తో కలిసి అట్లీ స్క్రిప్ట్‌ను వివరించబోతున్నారని అంటున్నారు. ఒకవేళ ఈ కాంబినేషన్ కార్యరూపం దాల్చితే, బాక్సాఫీస్ వద్ద సంచనాలు క్రియేటవ్వడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం సల్మాన్‌ఖాన్ ‘సికందర్’ చిత్రంలో నటిస్తున్నారు. మురుగదాస్ దర్శకుడు. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన అనంతరం అట్లీ-సల్మాన్‌ఖాన్ కాంబో మూవీ పట్టాలెక్కనుంది.