Rajinikanth | ఎన్ని ఫ్లాపుల్లో ఉన్నా ఒక్క హిట్ చాలు స్టార్ హీరోలకు.. దెబ్బకు పోయిన మార్కెట్‌తో పాటు ఇమేజ్ కూడా వచ్చేస్తుంది వెనక్కి..! రజినీకాంత్ లాంటి హీరోలకు అయితే మరీనూ.. ఆయన సింగిల్ బ్లాక్‌బస్టర్ కొడితే చూడాలని చాలా ఏళ్లుగా వేచి చూశారు ఫ్యాన్స్. కానీ వచ్చిన సినిమాలు వచ్చినట్లు పోతుంటే.. అసలు హిట్ వస్తుందా అనే అనుమానాలు కూడా ఒక దశలో వచ్చాయి అభిమానులకు. కానీ వాళ్ల ఆకలి తీర్చేలా జైలర్ వచ్చి దుమ్ము దులిపేసింది. కానీ ఈ చిత్రం కోరుకున్న దానికంటే ఎక్కువే వసూలు చేసింది. అసలెవరూ ఊహించని స్థాయిలో కనకవర్షం కురిపించింది. ఒక్కటి రెండు కాదు.. ఏకంగా 650 కోట్లు వసూలు చేసి ఔరా అనిపించాడు జైలర్. ఈ సినిమా ఇచ్చిన బూస్టప్‌తో అస్సలు ఆగట్లేదు రజినీకాంత్.
తన నెక్ట్స్ సినిమాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటున్నారు. మరీ ముఖ్యంగా నటీనటుల విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నారు. ప్రస్తుతం జై భీమ్ ఫేమ్ జ్ఞానవేల్‌తో సినిమా సెట్స్‌పైకి తీసుకొచ్చాడు రజినీ. ఈ సినిమా షూటింగ్ కేరళలోని వెల్లయాని అగ్రికల్చరల్ యూనివర్సిటీలో మొదలైంది. చాలా మలయాళ సినిమాల షూటింగ్స్ ఇదే యూనివర్సిటీలో జరిగాయి. తలైవా 170లోని సీన్స్ కూడా అక్కడే చిత్రీకరిస్తున్నారు దర్శకుడు జ్ఞానవేల్. రజినీకాంత్ కూడా సెట్స్‌లో జాయిన్ అయ్యాడు. ఈ సినిమా క్యాస్టింగ్ గురించి ఇండియన్ సినిమా మాట్లాడుకుంటుంది.
జైలర్‌లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్స్ ఉన్నారు. దానివల్ల తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళంలోనూ సినిమా బాగా వసూలు చేసింది. వాళ్లు కనిపించింది కాసేపే అయినా ఆడియన్స్ యాక్సెప్ట్ చేసిన విధానానికి ఫిదా అయిపోయాడు తలైవా. ఇప్పుడు నెక్ట్స్ సినిమాలోనూ క్యాస్టింగ్ మామూలుగా లేదు. ఇందులో అమితాబ్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్, మంజూ వారియర్ లాంటి స్టార్స్ ఉన్నారు. ఒకే సినిమాలో ఇంతమంది స్టార్స్ అంటే చిన్న విషయం కాదు.. కానీ అక్కడున్నది రజినీ కాబట్టి ఏదైనా సాధ్యమే. ఈ సినిమాకు కూడా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ దాదాపు 200 కోట్లతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.