Rajini -Kamal |ఇండియన్ సినిమా అభిమానులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. దక్షిణ భారత సినీ పరిశ్రమను ఏలిన ఇద్దరు లెజెండ్స్ సూపర్ స్టార్ రజనీకాంత్ , లోకనాయకుడు కమల్ హాసన్ మళ్లీ ఒకే ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపారు. అయితే ఫ్యాన్స్ ఊహించినట్లుగా ఇద్దరూ స్క్రీన్‌ను షేర్ చేసుకోవడమే కాదు, దానికి మించిన సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు. రజనీకాంత్ హీరోగా, కమల్ హాసన్ నిర్మాతగా తెరకెక్కనున్న ఈ చిత్రం ఇప్పటికే సెన్సేషన్‌గా మారింది. ‘రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ (RKFI) బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ భారీ చిత్రాన్ని “తలైవర్ 173” అనే వర్కింగ్ టైటిల్‌తో అధికారికంగా ప్రకటించారు. ప్రత్యేక వీడియో ద్వారా వెల్లడించిన ఈ హిస్టారిక్ అనౌన్స్మెంట్ సోషల్ మీడియాలో రికార్డులు బద్దలుకొడుతోంది.
ఆ వీడియోలో కమల్ హాసన్, రజనీకాంత్, దర్శకుడు సుందర్ సి. ముగ్గురూ ఒకే ఫ్రేమ్‌లో కనపడటమే అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.ఈ క్రేజీ కాంబోలో మరో హైలైట్ ఏంటంటే.. సుందర్ సి. దర్శకత్వం. రజనీకాంత్ – సుందర్ సి. కాంబినేషన్ అంటే ప్రేక్షకులకు వెంటనే గుర్తొచ్చేది “అరుణాచలం” లాంటి ఆల్-టైమ్ హిట్ సినిమా. దాదాపు 28 ఏళ్ల తర్వాత ఈ జోడీ మళ్లీ కలుస్తుంది. రజనీ ప్రత్యేకమైన కామెడీ టైమింగ్, మాస్ స్టైల్‌ను సుందర్ సి. ఏ రేంజ్లో చూపిస్తాడో అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సుందర్ సి. ఇటీవల కాలంలో హారర్ కామెడీ జానర్లో “చంద్రకళ”, “కళావతి” వంటి సినిమాలతో బంపర్ హిట్స్ సాధించాడు. ఇక రజనీకాంత్ “చంద్రముఖి” తర్వాత మళ్లీ ఆ జానర్‌ను టచ్ చేయలేదు. కాబట్టి ఈ ప్రాజెక్ట్ హారర్ ఎలిమెంట్స్‌తో ఉంటుందా అనే ఉత్కంఠ పెరిగింది.
“తమిళ సినిమాకు బ్లాక్ అండ్ వైట్ యుగం నుంచి గోల్డెన్ ఎరా వరకు నిలిచిన రెండు స్తంభాలు రజనీకాంత్, కమల్ హాసన్” అంటూ రాజ్ కమల్ ఫిల్మ్స్ విడుదల చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక లెజెండ్ మరో లెజెండ్‌తో తన సొంత బ్యానర్‌పై సినిమా చేయడం ఇండియన్ సినిమా చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ భారీ బడ్జెట్ సినిమాను రెడ్ జెయింట్ మూవీస్ ద్వారా 2027 పొంగల్ కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. రెండు తరాల అభిమానుల కోసం ఇది నిజమైన సినీ పండుగగా మారనుంది.