‘నిజజీవితంలో షష్టిపూర్తిని తప్పించుకోవాలని ప్రయత్నించా. కానీ సినిమా రూపంలో నాకిలా షష్టిపూర్తి జరిగిపోయింది. సాధారణంగా పెళ్లిళ్లలో నా ‘పెళ్లిపుస్తకం’పాటే వినిపిస్తుంటుంది. ‘ఆ నలుగురు’ విడుదలైన తర్వాత చావు విషయంలోనూ నా పాటే వినిపించడం మొదలైంది. ‘షష్టిపూర్తి’ టైమ్‌లో నా పాట లేదని చాలామంది అనేవాళ్లు. ఇప్పుడు ‘షష్టిపూర్తి’ పాట కూడా వచ్చేసింది. పైగా ఈ పాటను ఇళయరాజా చేయడం నా అదృష్టం. అలాగే అర్చనతో ఇన్నేళ్ల తర్వాత కలిసి నటించడం ఆనందంగా ఉంది. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాల్ని చాటిచెప్పే సినిమా ఇది. బిడ్డలు చూడగలిగిన తల్లిదండ్రుల పెళ్లే ఈ ‘షష్టిపూర్తి’.’ అని రాజేంద్రప్రసాద్ అన్నారు.
ఆయన, ఆర్చన జంటగా, రూపేష్, ఆకాంక్ష సింగ్ మరో జంటగా రూపొందిన ఫ్యామిలీ ఎంటైర్టెనర్ ‘షష్టిపూర్తి’. పవన్‌ప్రభ దర్శకత్వంలో రూపేష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. ఈ సందర్భంగా విజయవాడలో జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రాజేంద్రప్రసాద్ మాట్లాడారు. ఏపీ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్రావు, బోడె ప్రసాద్ ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు.
కథే ఈ చిత్రానికి ప్రధాన బలమని, రాజేంద్రప్రసాద్, అర్చన కాంబినేషన్లో సినిమా చేయడం సంతోషంగా ఉందని, ఇళయరాజా సంగీతం ఈ సినిమాకు మెయిన్ పిల్లర్ అని, సాంకేతికంగా అభినందనీయంగా సినిమా ఉంటుందని హీరో, నిర్మాత రూపేష్ తెలిపారు. అన్ని వర్గాల ప్రేక్షకులకూ నచ్చే సినిమా ఇదని డైరెక్టర్ పవన్ ప్రభ అన్నారు. ఇంకా నటి అర్చన, హీరోయిన్ ఆకాంక్ష సింగ్, గీత రచయిత చైతన్య ప్రసాద్ కూడా మాట్లాడారు..