Adipurush controversy | ‘ఆదిపురుష్’ సినిమాపై వివాదాలు ముసురుకుంటున్నాయి. ఇప్పటికే చాలా మంది ఎన్నో రకాలుగా వ్యాఖ్యలు చేశారు. కాగా, రాజస్థాన్ మంత్రి ఒకరు.. సెన్సార్ బోర్డు మాదిరిగా సనాతన్ బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభాస్ రాఘవుడిగా నటించిన ‘ఆదిపురుష్’ సినిమా విడుదలకు ముందే వివాదాలకు ఆజ్యం పోస్టున్నది. హిందూ దేవతలను అవమానించేలా ఈ సినిమా చిత్రీకరణ జరిపారంటూ పలు ప్రాంతాల్లో నిరసనలు మిన్నంటుతున్నాయి. సినిమాలను సెన్సార్ చేసి విడుదలకు అనుమతినిచ్చే సెన్సార్ బోర్డు మాదిరిగా.. మైథోలాజికల్ సినిమాలు కూడా విడుదల చేసేందుకు స్క్రీన్ చేసేందుకు సనాతన్ సెన్సార్ బోర్డును ఏర్పాటు చేయాలని రాజస్థాన్ మంత్రి ప్రతాప్ సింగ్ కఛారివాస్ డిమాండ్ చేస్తున్నారు. సనాతన్ సెన్సార్ బోర్డు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలంటూ ఈ మేరకు ప్రధాని మోదీకి ప్రతాప్‌సింగ్ లేఖ రాశారు. అఖిల భారత సంత్ సమితి ఇప్పటికే ఇలాంటి డిమాండ్‌ను ప్రభుత్వం ముందుంచింది. సనాతన్ సెన్సార్ బోర్డును ఏర్పాటు చేయాలని సంత్లు చేస్తున్న ఆందోళనకు సంపూర్ణ మద్ధతు ఇస్తున్నట్లు రాజస్థాన్ మంత్రి ప్రతాప్ సింగ్ తెలిపారు.
‘ఆదిపురుష్’ సినిమా ఇప్పటికే ఢిల్లీ కోర్టుకు చేరింది. ఆదిపురుషుడు శ్రీరాముడిని, హనుమంతుడిని తప్పుగా చిత్రీకరించారంటూ ఈ సినిమాపై కోర్టులో పిటిషన్ దాఖలైంది. చిత్ర నిర్మాత భూషణ్ కుమార్, దర్శకుడు ఓం రౌత్, సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలపై న్యాయవాది రాజ్ గౌరవ్ పిటిషన్ దాఖలు చేశారు. వాటిని తొలగించేలా ఆదేశాలివ్వాలంటూ ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేశారు.