Rajamouli | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న భారీ పాన్ వరల్డ్ చిత్రం ‘వారణాసి’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా ప్రకటించిన నాటి నుంచే ఈ ప్రాజెక్ట్‌పై అభిమానులు, సినీ వర్గాల్లో ఆసక్తి పెరుగుతూనే ఉంది. ఇటీవల విడుదలైన టీజర్‌తో ఈ చిత్రం ప్రేక్షకులను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లబోతోందనే సంకేతాలు మరింత బలపడ్డాయి. అయితే సినిమా షూటింగ్ ఎంత వేగంగా సాగుతోందో, అంతే వేగంగా లీకుల సమస్య కూడా చిత్రబృందాన్ని వెంటాడుతోంది. ముఖ్యంగా రాజమౌళి సినిమాల విషయంలో భద్రతా చర్యలు అత్యంత కట్టుదిట్టంగా ఉంటాయని పేరుంది. గతంలో ఆయన తెరకెక్కించిన చిత్రాల సమయంలో కూడా లీకులను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. కానీ ‘వారణాసి’ విషయంలో మాత్రం వరుసగా కొన్ని విజువల్స్ బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది.
కొద్ది నెలల క్రితం మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ పాల్గొన్న కీలక సన్నివేశానికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో చిత్రబృందంపై రాజమౌళి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని యూనిట్ సభ్యులను హెచ్చరించినట్లు ప్రచారం జరిగింది.ఆ తర్వాత కొంతకాలం పరిస్థితి సద్దుమణిగినప్పటికీ, తాజాగా మరోసారి లీకుల వ్యవహారం తెరపైకి వచ్చింది. ఇటీవల చిత్రీకరించిన ఉగ్రభట్టి గుహల నేపథ్యంలోని కీలక సన్నివేశాలకు సంబంధించిన కొన్ని విజువల్స్ సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ దృశ్యాలు సినిమా కథలో కీలక భాగంగా భావిస్తున్న నేపథ్యంలో వాటి లీక్ కావడం యూనిట్‌కు ఆందోళన కలిగిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈసారి రాజమౌళి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. గతంలో లీకులపై వెంటనే స్పందించిన ఆయన, ఇప్పుడు మౌనం పాటించడం వెనుక ఏదైనా ప్రత్యేక వ్యూహం ఉందా అనే చర్చ సోషల్ మీడియాలో సాగుతోంది.కొంతమంది నెటిజన్లు ఈ లీకులు ఉద్దేశపూర్వకంగా బయటకు వచ్చినవై ఉండొచ్చని అభిప్రాయపడుతుండగా, మరికొందరు లీకైన సన్నివేశాలు తుది చిత్రంలో ఉండకపోవచ్చని కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరు మాత్రం రాజమౌళి తనదైన శైలిలో పరిస్థితిని హ్యాండిల్ చేస్తున్నారని, సరైన సమయంలో స్పందిస్తారని భావిస్తున్నారు. ఇక అభిమానులు మాత్రం చిత్రబృందం మరింత అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. ఇటీవల కొన్ని భారీ చిత్రాలకు లీకులు పెద్ద సమస్యగా మారిన నేపథ్యంలో, ‘వారణాసి’ విషయంలో అలాంటి పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ లీకుల వ్యవహారాన్ని రాజమౌళి ఎలా ఎదుర్కొంటారన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.