Baahubali the Epic | ప్రస్తుతం టాలీవుడ్లో రీ-రిలీజ్ ట్రెండ్ జోరుగా నడుస్తోంది. గత సినిమాలు మళ్లీ థియేటర్లలో సందడి చేస్తుండగా, ఇప్పుడు తెలుగు సినిమాకి గర్వకారణమైన ‘బాహుబలి’ కూడా ఈ జాబితాలో చేరుతోంది. కానీ ఈసారి ‘బాహుబలి 1: ది బిగినింగ్’ & ‘బాహుబలి 2: ది కంక్లూజన్’ అనే రెండు భాగాల సినిమాలను కలిపి, ‘బాహుబలి – The Epic’ పేరుతో ఒక పార్ట్‌ని ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్లాన్ చేస్తున్నారు. అయితే రెండు పార్టుల నిడివి సుమారు 5 గంటల 27 నిమిషాలు కాగా, ఈ స్పెషల్ ఎడిషన్‌ను 3 గంటల 15 నిమిషాల వరకు కుదించి, అక్టోబర్ 31న థియేటర్లలో విడుదల చేయనున్నారు.
రీరిలీజ్ గురించి దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాను ఎడిట్ చేయడం చాలా కష్టమైన పని. ప్రతీ సీన్ నాకు విలువైనది. కానీ ఒక ఎపిక్ అనిపించే అనుభూతిని ఇవ్వాలంటే కొన్ని త్యాగాలు చేయాల్సివచ్చింది,’’ అని తెలిపారు. యుద్ధ సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్, ముఖ్యంగా అమరేంద్ర-భల్లాలదేవ మధ్య క్లాష్, దేవసేన కోణం వంటివి యథాతథంగా ఉంటాయట.అయితే శివుడు-అవంతిక లవ్ ట్రాక్, ‘పచ్చబొట్టేసిన..’ పాట వంటి రొమాంటిక్ సీన్స్ మాత్రం పూర్తి గా కత్తిరించబడ్డాయి.
ఇప్పటికే ‘బాహుబలి 2’లో తమన్నా పాత్ర పరిమితంగా ఉండగా, ఇప్పుడు మొదటి పార్ట్ నుంచి కొన్ని సీన్లు, పాటలు తీసేయడంతో ఆమె పాత్ర గెస్ట్ రోల్లా మారిపోయిందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అయితే ఈ స్పెషల్ ఎడిషన్ చూస్తే, ప్రామాణిక రీ-రిలీజ్‌లకు భిన్నంగా ఒక ప్రత్యేక అనుభూతి కలుగుతుంది. అందుకే ఈ ఎడిషన్ రూపొందించాం,’’ అని రాజమౌళి వివరించారు. ఈ దివాళికి బాహుబలి మేనియా మళ్లీ తెరపై సందడి చేయబోతుంది. కాకపోతే ఇది రొటీన్ రీ-రిలీజ్ కాదని, కొత్త అనుభూతితో, కొత్త రూపంతో వస్తోందని సినిమా బృందం హామీ ఇస్తోంది.