RGV | భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ‘ధురంధర్: ది రివెంజ్’ సినిమా పేరు మారుమోగుతోంది. మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ భారీ గూఢచారి యాక్షన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధిస్తోంది. గతంలో విడుదలైన ‘ధురంధర్’ సినిమాకు కొనసాగింపుగా వచ్చిన ఈ చిత్రం, విడుదలైన మొదటి రోజే వంద కోట్లకు పైగా నికర వసూళ్లు సాధించి కొత్త రికార్డులను నెలకొల్పింది. ఈ చిత్రంలో హీరోగా నటించిన రణవీర్ సింగ్ తన శక్తివంతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోగా, దర్శకుడు ఆదిత్య ధర్ అద్భుతమైన తెరకెక్కింపుతో సినిమాను ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగ క్షణాలు, కథలోని మలుపులు అన్నీ కలిపి ఈ సినిమాను ప్రేక్షకులకు ఒక ప్రత్యేక అనుభూతిని ఇచ్చాయి..
ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. తాజాగా ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కూడా ఈ చిత్రాన్ని చూసి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ… “మొదటి భాగం నాకు చాలా నచ్చింది. కానీ రెండో భాగం స్కేల్ పరంగానూ, భావోద్వేగాల పరంగానూ మరింత గొప్పగా ఉంది. కథనం, నటీనటుల ఎంపిక, సాంకేతిక అంశాలు అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేసేలా సినిమా రూపొందింది” అని తెలిపారు. ప్రత్యేకంగా రణవీర్ సింగ్ నటనపై ఆయన ప్రశంసలు కురిపించారు. సినిమా ప్రారంభం నుంచి క్లైమాక్స్ వరకు పాత్రలో పూర్తిగా మునిగిపోయి ప్రేక్షకులను ఆకట్టుకున్నారని పేర్కొన్నారు. అలాగే మాధవన్ నటన కూడా సినిమాకు ఎంతో బలం చేకూర్చిందని చెప్పారు.
ఈ చిత్రంలో సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా వంటి ప్రముఖ నటులు నటించడం మరో ప్రత్యేకతగా నిలిచింది. భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు, గుండెను హత్తుకునే భావోద్వేగ క్షణాలు ఈ సినిమాను మరింత ఆకర్షణీయంగా మార్చాయి. ప్రస్తుతం ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనను బట్టి చూస్తే, ఈ చిత్రం దీర్ఘకాలంలో భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రెండు వేల కోట్లకు పైగా వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి, ‘ధురంధర్: ది రివెంజ్’ సినిమా కేవలం యాక్షన్ చిత్రం మాత్రమే కాకుండా భావోద్వేగాలతో కూడిన ఒక గొప్ప సినీ అనుభూతిగా నిలిచింది. దర్శకుడు ఆదిత్య ధర్ ప్రతిభను మరోసారి నిరూపించిన ఈ చిత్రం, భారతీయ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందని చెప్పవచ్చు.
‘ధురంధర్: ది రివెంజ్’ విడుదలకు ముందే దర్శకుడు ఆదిత్య ధర్‌కు అభిమానిగా మారిన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఈ చిత్రంపై తాజాగా చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సినిమా విడుదలకు ముందే ‘ధురంధర్’పై ఒక పెద్ద ట్వీట్ చేస్తూ ఆదిత్య ధర్ ప్రతిభను ప్రశంసించిన వర్మ , ఇప్పుడు సినిమా విడుదలైన తర్వాత మరింత స్పష్టంగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆయన మాటల్లో… “నేటి తరం దర్శకుల్లో ఆదిత్య ధర్ ప్రత్యేకమైన శైలిని కలిగిన దర్శకుడు. ‘ధురంధర్’ చూసిన తర్వాత ఇది నాకు మరింత స్పష్టమైంది” అని తెలిపారు.
అంతేకాకుండా, ఇతర దర్శకుల పనితీరుపై కూడా స్పందిస్తూ, మోహిత్ సూరి రూపొందించిన ‘సయారా’ కూడా కొత్తగా అనిపించిందని, తాను ఆ చిత్రాన్ని కూడా ఆస్వాదించానని చెప్పారు. అయితే ‘ధురంధర్’ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ, ఈ సినిమా సాధారణ వినోద చిత్రంగా కాకుండా, సినిమా భాషను మార్చే స్థాయిలో ఉందని పేర్కొన్నారు.ఇది కేవలం ఒక సినిమా కాదు. ఇది సినిమా వ్యాకరణాన్నే మార్చేసింది. ప్రేక్షకులు సినిమాను చూసే విధానాన్ని కూడా ప్రభావితం చేసింది. భవిష్యత్తులో కొత్త తరం దర్శకులు ఈ చిత్రాన్ని ఒక ప్రమాణంగా తీసుకుని సినిమాలు చేస్తారు” అని వర్మ అన్నారు.