‘బాహుబలి’ చిత్రం తెలుగు సినిమా కీర్తిప్రతిష్టల్ని అంతర్జాతీయ వేదికపై ఘనంగా చాటిచెప్పింది. భారతీయ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా రికార్డులకెక్కింది. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అపూర్వ ఆదరణ సొంతం చేసుకుంది. దీంతో ‘బాహుబలి-3’ ఎప్పుడు రానుందోనని ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మూడోభాగంపై దర్శకనిర్మాతల నుంచి కూడా ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాలేదు. ‘బాహుబలి’ మూడోభాగం గురించి తానేమీ మాట్లాడలేనని..సమయం వచ్చినప్పుడు అది కార్యరూపం దాల్చుతుందని ఇటీవలే ప్రభాస్ తెలిపారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో దర్శకుడు రాజమౌళి ‘బాహుబలి-3’ గురించి ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించారు. “బాహుబలి-3’ తప్పకుండా ఉంటుందనుకోవచ్చు. ప్రస్తుతం మూడో భాగానికి సంబంధించిన పనుల్లో ఉన్నాం. ‘బాహుబలి’ చుట్టూ చోటుచేసుకునే ఎన్నో సంఘటనల్ని మీకు చూపిస్తాం. నిర్మాత శోభు యార్లగడ్డ కూడా మూడోభాగానికి సుముఖంగా ఉన్నారు. దీనికి కొంచెం సమయం పడుతుంది. ‘బాహుబలి’ రాజ్యం నుంచి ఆసక్తికరమైన వార్త వస్తుంది’ అని రాజమౌళి అన్నారు. సోషల్‌మీడియాలో ఆయన మాటలు వైరల్‌గా మారాయి. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఈ నెల 25న విడుదలకాబోతున్న విషయం తెలిసిందే. దీని అనంతరం మహేష్‌బాబుతో రాజమౌళి ఓ సినిమా చేయబోతున్నారు. జంగిల్ అడ్వెంచర్ నేపథ్యంలో పాన్ఇండియా స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.