RRR First day Target| రాజమౌళి సినిమా అంటే ఒకప్పుడు కేవలం తెలుగు ఇండస్ట్రీ మాత్రమే ఆసక్తిగా చూసేది. కానీ బాహుబలి తర్వాత లెక్కలు మొత్తం మార్చేశాడు జక్కన్న. ఇండియన్ సినిమాను ఒకే తాటిపైకి తీసుకొచ్చి 2 వేల కోట్ల మార్క్ అందుకున్నాడు. ఇండియాలో అధికారికంగా 1000 కోట్లు దాటిన మొదటి సినిమా బాహుబలి 2. ఈ సినిమా సృష్టించిన సంచలనాలు ఇప్పటికీ ఎవరూ మరిచిపోలేకపోతున్నారు. ఐదేండ్లు అయినా కూడా నేటికీ బాహుబలి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర నెంబర్ వన్గానే కొనసాగుతోంది. ఈ మధ్యలో ఎన్నో సినిమాలు వచ్చినా కూడా బాహుబలి మాత్రం టచ్ చేయలేకపోయాయి. ఈ క్రమంలో మళ్లీ రాజమౌళి RRR సినిమాతో వస్తున్నాడు. దీంతో ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తెలుగుతో పాటు మిగిలిన అన్ని భాషల్లో కూడా ఈ సినిమా అత్యధిక థియేటర్స్లో విడుదల కానుంది. దీంతో మొదటి రోజు ఈ మల్టీస్టారర్ ఎంత వసూలు చేయబోతుందనే విషయంపై ట్రేడ్ పండితులు ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన రికార్డు బాహుబలి 2 పేరు మీద ఉంది. 2017 లోనే ఈ సినిమా మొదటిరోజు రూ.43 కోట్ల షేర్ వసూలు చేసింది. మరోవైపు బాలీవుడ్లో కూడా మొదటి రోజు దాదాపు 44 కోట్లు వసూలు చేసింది బాహుబలి 2. ఐదేళ్ల కింద ఈ సినిమాకు మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 130 కోట్ల షేర్ వచ్చింది. గ్రాస్ 200 కోట్లకు పైగానే ఉంది. ఇప్పుడు మరోసారి అదే రికార్డు చేరుకుంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం ఉన్న టిక్కెట్ల ధరల చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రికార్డు కచ్చితంగా బద్దలయ్యేలా కనిపిస్తోంది. అయితే హిందీ, తమిళం, కన్నడం, మలయాళంలో మాత్రం ఊహించిన ఓపెనింగ్స్ వస్తాయా అనేది అనుమానమే. ఎందుకో తెలియదు కానీ బాహుబలికి వచ్చినంత క్రేజ్ ట్రిపుల్ ఆర్ సినిమాకు మిగిలిన ఇండస్ట్రీల్లో రావడం లేదు. అందుకే ఆ సినిమా సృష్టించిన రికార్డులు ఈ సినిమా బద్దలు కొడుతుందా అంటే అనుమానమే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఏదేమైనా ట్రిపుల్ ఆర్ మొదటి రోజు 200 కోట్లు వసూలు చేస్తుందా లేదా అనేది చూడాలి. మార్చి 25న దాదాపు 10 వేల థియేటర్లలో ఈ సినిమా విడుదలవుతుంది.