Rajamouli | హాలీవుడ్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఫిల్మ్ సిరీస్ ‘అవతార్’ నుంచి మూడో భాగం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘అవతార్’, ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు జేమ్స్ కామెరాన్, ఇప్పుడు ‘అవతార్ పార్ట్ 3 – ఫైర్ అండ్ యాష్’ తో మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేయడానికి సిద్ధమయ్యాడు. ఇండియాలో అవతార్ సినిమాలకు భారీ మార్కెట్, ఫాలోయింగ్ ఉండటంతో ఈ చిత్రాన్ని ఇక్కడ గ్రాండ్ లెవల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమా డిసెంబర్ 19న విడుదల కానుండగా, హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
అవతార్ 3 ఇండియా ప్రమోషన్స్‌లో భాగంగా, జేమ్స్ కామెరూన్ .. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళితో స్పెషల్ వీడియో ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ…“అవతార్ సినిమా చూస్తున్నప్పుడు నేను థియేటర్లో పిల్లవాడిలా మైమరిచిపోయాను. హైదరాబాద్ ఐమాక్స్‌లో అవతార్ సినిమా దాదాపు ఒక సంవత్సరం పాటు ప్రదర్శించబడింది,”అని జేమ్స్ కామెరాన్‌కు తెలిపారు. అలాగే అవతార్ ఫ్రాంచైజీ బిగ్ స్క్రీన్ అనుభవాలకు ఒక బెంచ్‌మార్క్ అని ప్రశంసించారు. ఇక జేమ్స్ కామెరాన్, రాజమౌళి సినిమాటిక్ విజన్‌ను ప్రశంసిస్తూ… ఇండియన్ సినిమాల స్థాయి ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. ముఖ్యంగా రాజమౌళి సినిమాలు గ్లోబల్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. త్వరలోనే ఇండియన్ ఫిల్మ్ సెట్స్‌ను సందర్శించాలని ఉంది,” అని తెలిపారు.
ప్రపంచ స్థాయి దర్శకులు అయిన జేమ్స్ కామెరాన్ – రాజమౌళి మధ్య జరిగిన ఈ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రెండు ఇండస్ట్రీలను కలిపేలా సాగిన ఈ ఇంటర్వ్యూ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచింది. ‘అవతార్ 3 – ఫైర్ అండ్ యాష్’ భారతీయ ప్రేక్షకులను మరోసారి థియేటర్లకు ఆకర్షిస్తుందా? ఇండియాలో ఈ సినిమా ఎంతటి వసూళ్లు సాధిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.