ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘కల్కి2898’లో అగ్ర దర్శకుడు రాజమౌళి అతిథి పాత్రలో కనిపించబోతున్నాడే వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మెగాఫోన్ పట్టుకొని బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టే రాజమౌళి..అప్పుడప్పుడు వెండితెరపై తళుక్కున మెరుస్తుంటారు కూడా. ‘ఈగ’ ‘ఆర్ఆర్ఆర్’ వంటి చిత్రాల్లో ఆయన తెరపై కనిపించారు. తాజా సమాచారం ప్రకారం ‘కల్కి’ చిత్రంలో కూడా ఓ చిన్న పాత్రలో ఆయన కనిపించబోతున్నారని వార్తలొస్తున్నాయి.
‘కల్కి’ ఫస్ట్గ్లింప్స్ విడుదల సందర్భంగా చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ రాజమౌళి చేసిన ట్వీట్ కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో ఆయన ‘కల్కి’ చిత్రంలో భాగం కాబోతున్నారనే వార్త వైరల్గా మారింది. అయితే విషయంలో నిజమెంతో తెలియాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే అంటున్నారు. నాగ్అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కల్కి 2898’ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్నది. వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ నిర్మిస్తున్నారు.