ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఇటీవల గ్లోబ్ ట్రాటార్ ఈవెంట్లో హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ.. పలు హిందూ సంఘాలు బీజేపీ నేతలు రాజమౌళిని విమర్శిస్తూ వీడియోలు విడుదల చేయడమే కాకుండా అతడు క్షమాపణలు చెప్పాలంటే డిమాండ్ చేశారు. అయితే రాజమౌళి వ్యాఖ్యలపై తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. రాజమౌళి నిజమైన నాస్తికుడైతే బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే రాజమౌళి తెరకెక్కించే ప్రతీ సినిమాను హిందూ సమాజం బహిష్కరించాలని రాజాసింగ్ పిలుపునిచ్చారు.
దేవుళ్లపై సినిమాలు తీసి కోట్లు సంపాదించిన రాజమౌళి.. దేవుళ్లు అంటే నమ్మకం లేనప్పుడు ఆ సినిమాలు తీయడం ఎందుకు? అని రాజాసింగ్ ప్రశ్నించారు. గతంలో కూడా దేవుళ్లపై రాజమౌళి ఇష్టారీతిన వ్యాఖ్యలు చేశారని రాజా సింగ్ అన్నారు. అంతేగాకుండా తన కొత్త చిత్రం ‘వారణాసి’ ప్రమోషన్స్ కోసమే రాజమౌళి ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడారా అనే దానిపై వెంటనే క్లారిటీ ఇచ్చి క్షమాపణ చెప్పాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. అలాగే ధర్మంపై ఎవరు తప్పుగా మాట్లాడిన ఏం జరుగుతుందో చూపిస్తాం అని రాజాసింగ్ తీవ్రంగా హెచ్చరించారు. అయితే ఈ వ్యాఖ్యలపై రాజమౌళి ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి.
అసలు ఏం జరిగిందంటే
గ్లోబ్ ట్రాటార్ ఈవెంట్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో జక్కన్న తండ్రి విజయేంద్రప్రసాద్ రాజమౌళి వద్దకు వచ్చి హనుమంతుడిని తలచుకో అంతా సెట్ అవుతుందని చెబుతాడు. అయితే ఈ విషయంపై రాజమౌళి మాట్లాడుతూ.. నేను మాములుగా దేవుడిని నమ్మను. నాన్న గారు వచ్చి ఇందాక హనుమాన్ వెనకాల ఉంటాడు.. గుండెతట్టి నడిపిస్తాడు అని చెప్పారు.. ఇలా అయిన వెంటనే కోపం వచ్చిందండి …ఇదేనా నడిపించేది అని. మా ఆవిడకి హనుమంతుడు అంటే చాలా చాలా ఇష్టం.. ఫ్రెండ్ లాగా మాట్లాడుతది అతడితో.. మా ఆవిడా మీద కూడా కోపం వచ్చింది… ఏంటి ఇదేనా చేసేది అని చెప్పుకోచ్చాడు. అయితే రాజమౌళి చేసిన వ్యాఖ్యలు పలు హిందు సంఘాలతో పాటు బీజేపీ నేతల మనోభావాలను దెబ్బతీశాయి. దీంతో రాజమౌళి వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ సనతాన ధర్మ రక్షకులు డిమాండ్ చేస్తున్నారు.