Raja Saab | ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబినేషన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘రాజాసాబ్ (Rajasaab)’ పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. హారర్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రద్దీ కుమార్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేయగా, తాజాగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆ ఉత్సాహాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ ఈవెంట్లో ప్రభాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. సినిమాలో నానమ్మ పాత్రలో నటించిన నటి గురించి మాట్లాడిన ప్రభాస్, “ఇది నానమ్మ – మనవడి కథ. ఈ సినిమాలో నేను మాత్రమే కాదు, ఆమె కూడా హీరోనే” అంటూ ప్రత్యేకంగా ప్రశంసించారు. దీంతో ఆ నానమ్మ పాత్రలో నటించిన నటి ఎవరు? అన్న ఆసక్తి నెటిజన్లలో మొదలైంది.
ఆ పాత్రలో నటించింది మరెవరో కాదు… సీనియర్ నటి జరీనా వాహబ్. బాలీవుడ్లో ఒకప్పటి టాప్ నటిగా గుర్తింపు పొందిన జరీనా వాహబ్, హిందీతో పాటు తెలుగు, తమిళ చిత్రసీమల్లోనూ కీలక పాత్రలు పోషించారు. విశాఖపట్నానికి చెందిన ఆమె, సినిమాలపై ఉన్న మక్కువతో బాలీవుడ్ వైపు అడుగులు వేశారు. 1974లో విడుదలైన ‘ఇష్క్.. ఇష్క్.. ఇష్క్’ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టిన ఆమె, తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆరంభంలో కొన్ని నిరాశలు ఎదురైనా, తనపై నమ్మకాన్ని కోల్పోకుండా అవకాశాల కోసం ప్రయత్నాలు కొనసాగించారు. ఒక దశలో ప్రముఖ నిర్మాత రాజ్ కపూర్ ఆమెను రిజెక్ట్ చేసినా, పట్టుదలతో ముందుకెళ్లి టాప్ నటిగా ఎదిగారు. తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన ‘గాజుల కిష్టయ్య’ ఆమె తొలి చిత్రం. ఆ తర్వాత ‘అమర ప్రేమ’, ‘హేమా హేమీలు’ వంటి చిత్రాల్లో నటించారు.
ఇటీవలి కాలంలో ‘రక్త చరిత్ర’, ‘రక్త చరిత్ర 2’, ‘విశ్వరూపం’, ‘విరాట పర్వం’, ‘దసరా’, ‘దేవర’ వంటి సినిమాల్లో కీలక పాత్రలతో మరోసారి తన నటనా సత్తా చాటారు. వ్యక్తిగత జీవితంలో 1986లో నటుడు ఆదిత్య పంచోలిని వివాహం చేసుకున్న జరీనా వాహబ్కు ఇద్దరు సంతానం ఉన్నారు. వారు కూడా ప్రస్తుతం నటులుగానే కొనసాగుతున్నారు. ఇప్పుడు ‘రాజాసాబ్’ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్న జరీనా వాహబ్, నానమ్మ పాత్రలో ఎంతవరకు మెప్పిస్తారో అన్న ఆసక్తి నెలకొంది. ప్రభాస్ మాటలే ఆమె పాత్రకు ఉన్న ప్రాముఖ్యతను చెప్పేస్తున్నాయి. మరి ఈ హారర్ కామెడీ ఎంటర్టైనర్లో నానమ్మ పాత్ర ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి.