Raja Saab | ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కించిన తాజా చిత్రం ‘ది రాజాసాబ్’ సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. ఒక వర్గం ప్రేక్షకులు సినిమాను ఎంటర్టైనింగ్గా ఉందని ప్రశంసిస్తే, మరో వర్గం మాత్రం ఆశించిన స్థాయిలో లేదని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ మొదలుపెట్టగా, రెబల్ ఫ్యాన్స్ దానికి గట్టిగా కౌంటర్ ఇస్తూ వింటేజ్ డార్లింగ్ ప్రభాస్‌ను చూపించారంటూ దర్శకుడు మారుతిని సమర్థించారు. అయితే అనూహ్యంగా గత రెండు మూడు రోజులుగా నెట్టింట ట్రోలింగ్ తీవ్రత మరింత పెరిగింది.
దర్శకుడు మారుతితో పాటు ఆయన సన్నిహితుడు, ‘ది రాజాసాబ్’ క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ను లక్ష్యంగా చేసుకుని వరుసగా అవమానకరమైన పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ ట్రోలింగ్‌కు ఎస్కేఎన్ ఘాటుగా స్పందిస్తూ కొన్ని పోస్టులు పెట్టినట్లు స్క్రీన్షాట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో నిర్మాత ఎస్కేఎన్ పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియాలో తన సినిమాను, అందులోని నటీనటులను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తూ అవమానకరమైన, తప్పుదారి పట్టించే పోస్టులు పెడుతున్నారని ఆయన సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
కొంతమంది తన పేరుతోనే నకిలీ పోస్టులు పెట్టి సినిమాలు, హీరోలు, నటులపై విమర్శలు చేస్తూ నెగిటివిటీని వ్యాప్తి చేస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి దురుద్దేశపూరిత చర్యలు గందరగోళాన్ని సృష్టిస్తున్నాయని, వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్కేఎన్ పోలీసులను కోరారు. ఈ ఫిర్యాదుతో పాటు ట్రోలింగ్ చేస్తున్నట్లు అనుమానిస్తున్న కొన్ని సోషల్ మీడియా అకౌంట్ల స్క్రీన్షాట్లను కూడా పోలీసులకు సమర్పించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.